తమ కార్యకర్తల మీదికే బుల్డోజర్లు ఎక్కిస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే

త్వరలో ఉత్తరప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, హైదర్‌గఢ్ నియోజకవర్గం లోని సుబేహా నగర్ లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దినేష్ రావత్ ఓ సమావేశం నిర్వహించాడు.

Advertisement
Update:2022-12-13 15:17 IST

బీజేపీకి మరో పేరు బుల్డోజర్ గా మార్చేశాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లో తమకు నచ్చని వాళ్ళ ఆస్తులను, ముఖ్యంగా మైనార్టీల ఇళ్ళను బుల్డోజర్లతో కూలగొడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది అక్కడి సర్కార్. ఇప్పుడు ఆ బుల్డోజర్ సంస్కృతి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా పాకింది. చివరికి ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని కాషాయ దళాలు న్యూయార్క్ నగర వీధుల్లో బుల్డోజర్లతో ఊరేగింపులు తీసేదాకా వెళ్ళింది. ఇప్పుడు బుల్డోజర్ అంటే మైనార్టీలపై కక్ష తీర్చుకోవడానికి బీజేపీ చేతిలోని ఆయుధంగా మారిపోయింది.

అయితే ఎటువంటి అణిచివేతనైనా, అరాచకాన్నైనా సమర్దించుకుంటూ పోతే ఏం జరుగుతుందో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలకు, చోటా మోటా నాయకులకు ఇప్పుడు తెలిసొచ్చింది. మైనార్టీల ఇళ్ళపై బుల్డోజర్లు నడుపుతూ ఉంటే కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసిన బీజేపీ కార్యకర్తలకు ఇప్పుడు ఆ బుల్డోజర్లు తమ మీదకే వస్తున్నాయనేది అర్దమయ్యింది.

త్వరలో ఉత్తరప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, హైదర్‌గఢ్ నియోజకవర్గం లోని సుబేహా నగర్ లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దినేష్ రావత్ ఓ సమావేశం నిర్వహించాడు. బారాబంకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశాంక్ కుష్మేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, హాజరైన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎవరైనా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్ గా బరిలోకి దిగితే బుల్డోజర్ మీదెక్కిస్తానని హెచ్చరించాడు.

"విషయాలు ముందే స్పష్టంగా చెప్పడం ఉత్తమం. ఎవరూ ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో నిలబ‌డకూడదు'' అని రావత్ అన్నారు.

" మీరు మా అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటే, మొదట అసలు మమ్ములను టికట్ కోసం అడగకండి. ఒక సారి మీరు మమ్ములను పార్టీ టికట్ కోసం అడిగి మేమివ్వకపోతే మా అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో నిలబడితే మీ మీంచి బుల్డోజర్లు వెళ్తాయి.'' అని బెదిరించారు ఎమ్మెల్యే.

బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భయం వల్ల ఆయన ముందు ఏమీ మాట్లాడలేకపోయినప్పటికీ లోలోపల రగిలిపోతున్నారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని బారాబంకి బిజెపి యూనిట్‌కు చెందిన పార్టీ నాయకుడు ఒకరు ఓ ప్రముఖ వెబ్ సైట్ తో మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యంలో, పార్టీ కార్యకర్తలందరికీ ఏ పదవినైనా కోరుకునే అర్హత ఉంది. కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి హక్కు ఉన్నది. అలాగే టికట్ అడిగే హక్కు ఉన్నది. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఎన్నికల్లో టికట్ అడగడం సహజం. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశాము''అని ఆయన అన్నారు.

బిజెపి ఎమ్మెల్యే తన సొంత పార్టీ నేతలను బెదిరించడంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.

అఖిలేష్ సోమవారం బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యల గురించి ట్విట్టర్‌లో ఒక వార్తా కథనాన్ని పోస్ట్ చేసి, "వారి (బిజెపి) గురించి ప్రపంచానికి తెలుసు, కాని వారి కార్యకర్తలు జీతాలు పొందుతున్నందున ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్నారు" అని రాశారు.

సుబేహా నగర్ లో 2011 నుండి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సారి కూడా బీజేపీ గెలవలేదు. ఈ సారి ఏమైనా చేసి బీజేపీని గెలిపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఈ సమావేశం నిర్వహించాడు.

ఏమైనా చేయడం అంటే బుల్డోజర్లను ఎక్కించడం కూడా! విధ్వంసం చేయడం తప్ప మరేమీ తెలియని బుల్డోజర్లకు తమ ఎదురుగా ఉన్న వాటిని ధ్వంసం చేయడమే తప్ప ఎదురుగా ఉన్నది మనవారా పరాయివారా అనే విషయం ఎలా తెలుస్తుంది ?

Tags:    
Advertisement

Similar News