బుల్డోజరే అంబులెన్స్ అయింది!

మధ్యప్రదేశ్ లో వైద్య సేవల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. కనీసం రోగులకు అర్జెన్సీ ఉంటే తీసుకేళ్ళడానికి అంబులెన్స్ లు కూడా దొరకవు. రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ ఓ వ్యక్తి అంబులెన్స్ కోసం అరగంటకు పైగా ఎదిరిచూసిన తర్వాత‌ ఓ బుల్డోజర్ డ్రైవర్ అతన్ని బుల్డోజర్ పై ఆస్పత్రికి తీసుకెళ్ళాల్సి వచ్చింది.

Advertisement
Update:2022-09-13 20:33 IST

 బిజెపి పాలిత మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సేవ‌లు పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత‌ను గుర్తు చేస్తున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల‌లో వైద్య సేవ‌లు అమోఘం అంటూ ఆ పార్టీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌లోని డొల్ల త‌నం మ‌ధ్య ప్ర‌దేశ్ లో బ‌య‌ట ప‌డింది. ఓ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వ అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఎంత‌సేప‌టికీ రాక‌పోయేస‌రికి బాధితుడి కి ర‌క్త‌స్రావం పెరిగిపోయి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఇంత‌లో అక్క‌డే ప‌నిచేస్తున్న ఓ బుల్డోజ‌ర్ డ్రైవ‌రు అత‌నిని బుల్డోజర్ పై ప‌డుకోబెట్టుకుని ఆస్ప‌త్రికి చేర్చాడు.

కత్ని జిల్లా గేర్త‌లాయ్ వ‌ద్ద మ‌హేష్ బ‌ర్మ‌న్ అనే వ్య‌క్తి మోటారు సైకిల్ పై వెళుతుండ‌గా ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. దాదాపు అర‌గంట సేపు వేచిచూసినా అంబులెన్స్ రాలేదు. ఇది చూసిన పుష్పేంద్రు విశ్వ‌క‌ర్మ త‌న బుల్‌డోజ‌ర్ లో అత‌నిని ఆస్ప‌తికి తీసుకెళ్ళాడు. ఈ వీడియో వైర‌ల‌వుతోంది.

ఇదొక్క‌టే తొలికేసు కాదు. అటువంటి సంఘ‌ట‌న‌లు నిత్య‌మూ రాష్ట్రంలో ఏదో మూల జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఆరోగ్య సేవ‌ల‌కు భారీగా బ‌డ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. అయినా ప్ర‌మాదాల్లో చిక్కుకున్న బాధితులు అంబులెన్స్ లు దొర‌క్క‌పోవ‌డంతో తోపుడు బండ్లు, సైకిళ్ళు అవీ అందుబాటులో లేక‌పోతే భుజాన మోసుకుంటూ బాధితుల‌ను ఆస్ప‌త్రుల‌కు తీసుకెళ్ళిన అనేక సంఘ‌ట‌న‌ల వీడియోలు సామాజిక మాద్య‌మాల్లో వైర‌లైన విష‌యం తెలిసిందే.

గత నెలలో, దామోహ్ జిల్లా లో కైలాష్ అహిర్వాల్ అనే వ్యక్తి తన గర్భవతి అయిన భార్యను తోపుడు బండిలో ఆసుపత్రికి తీసుకువెళ్తున్న‌ వీడియో వెలుగుచూడ‌డంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు గంట‌ల పాటు అంబులెన్స్ కోసం వేచి చూసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని అత‌ను చెప్పాడు. రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తమకు డాక్టర్ కానీ నర్సు కానీ కనిపించలేదని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ అంబులెన్స్‌లో ఆమెను హట్టాకు తరలించారు. కానీ అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆమెను దమోహ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారని అహిర్వాల్ తెలిపారు.

వాహనాల సంఖ్యను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అంబులెన్స్‌లో సమస్య కొనసాగుతోంది. ఏప్రిల్‌లో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అంబులెన్స్ ల సంఖ్య 1,445 నుండి 2,052కి పెరిగిందని ప్రకటించారు. అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ సంఖ్య కూడా 75 నుండి 167కి పెంచామ‌ని, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ల సంఖ్య 531 ఉండగా, 835కి పెంచామ‌ని తెలిపారు. కాగా ప్ర‌భుత్వం ఈ డ‌య‌ల్ 108 అంబులెన్స్ సేవ‌ల‌పై యేటా రూ.220 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తోంది. కానీ ప్ర‌తి జిల్లాలో క‌నీసం రోజుకు 53 కేసుల‌లో కూడా సేవ‌లు అందించ‌లేక‌పోతున్నార‌ని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ పాలసీ అనాలిసిస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పరిశోధకులు మార్చిలో ప్ర‌క‌టించారు. యేటా ప‌ది ల‌క్ష‌ల మంది ప్రైవేటు అంబులెన్స్ ల పై ఆధార‌ప‌డుతున్నార‌ని వారి విశ్లేష‌ణ లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News