బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు.. - కిడ్నాప్, హత్య కేసుల్లో దోషిగా తేలడంతో లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం
అఫ్జల్ సోదరుడు ముక్తార్ అన్సారీకి కూడా ఈ కేసులో న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కిడ్నాప్, హత్య ఘటనల్లో గ్యాంగ్‌స్టర్ నిరోధక చట్టం కింద 2007లో అఫ్జల్, ముక్తార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఎంపీపై అనర్హత వేటు పడింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి కిడ్నాప్, హత్య కేసులో ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
అఫ్జల్ సోదరుడు ముక్తార్ అన్సారీకి కూడా ఈ కేసులో న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కిడ్నాప్, హత్య ఘటనల్లో గ్యాంగ్‌స్టర్ నిరోధక చట్టం కింద 2007లో అఫ్జల్, ముక్తార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2007లో వీహెచ్‌పీ నేత నందకిశోర్ కిడ్నాప్ వ్యవహారం.. 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్య కేసుల్లో ముక్తార్ అన్సారీ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అఫ్జల్ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయనపైనా కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో వారికి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.