మహారాష్ట్రలో 26న బీఆర్ఎస్ మరో మహాసభ.. - కేసీఆర్ హాజరుకానుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్న వైనం
కాందార్ లోహ బహిరంగసభకు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు హాజరుకానున్న నేపథ్యంలో జనసమీకరణను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అక్కడ తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగసభ విజయవంతం అయిన నేపథ్యంలో ఈనెల 26న మరో సభ భారీస్థాయిలో నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. నాందేడ్‌కి సమీపంలోని కాందార్ లోహలో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలపై దృష్టిపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తోంది.
కాందార్ లోహ బహిరంగసభకు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు హాజరుకానున్న నేపథ్యంలో జనసమీకరణను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందికి పైగా జనంతో ఈ సభ నిర్వహించాలని లక్ష్యంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ ద్వారా లాతూర్ లోక్‌సభ పరిధిలో తమ పార్టీ ప్రభావం పెరుగుతుందనేది ఆ పార్టీ నేతల అంచనా.
కేసీఆర్ సభకు అధ్యక్షత వహించనుండటంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. ఆ బాధ్యతలను తెలంగాణ పీయూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పార్టీ మహారాష్ట్ర శాఖ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం పర్యవేక్షణ చేస్తున్నారు.
సభ ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ మోడల్‌ను ప్రమోట్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్ స్క్రీన్ల వాహనాలను ఉపయోగిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.