ఒకరికి అంబానీ కావాలి.. మరొకరికి అదానీ కావాలి : సీఎం కేసీఆర్

కేంద్రంలో కొన్ని దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదని.. అవి కొన్ని ధనవంతుల కుటుంబాలకే గులాములు అని అన్నారు.

Advertisement
Update:2023-02-05 16:54 IST

ఒక నేతకు అంబానీ కావాలి.. మరొకరికి అదానీ కావాలి.. గత 75 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీల అజెండా ఇదే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇప్పుడున్న బీజేపీ అయినా, గతంలో పాలించిన కాంగ్రెస్ అయినా ఆ రెండు కుటుంబాలకే దాసోహం చేస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న పార్టీ అధినేత కేసీఆర్.. తొలి సారిగా తెలంగాణ వెలుపల భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

కేంద్రంలో కొన్ని దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదని.. అవి కొన్ని ధనవంతుల కుటుంబాలకే గులాములు అని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మేకిన్ ఇండియా అంటూ దాన్ని జోక్ ఇన్ ఇండియాగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మన దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా చైనా బజార్లు ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. మాంజా దారం నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచే దిగుమది చేసుకోవడం చాలా సిగ్గు చేటని కేసీఆర్ విమర్శించారు.

ఒకవైపు మన్ కీ బాత్, మేకిన్ ఇండియా పేరుతో ప్రజల్ని వంచిస్తూ.. చైనా ప్రొడక్ట్స్‌ను దిగుమతి చేసుకోవడంపై కేసీఆర్ మండిపడ్డారు. తాను మాట్లాడుతోంది రాజకీయం గురించి కాదని.. ప్రజల జీవన్మరణ సమస్య గురించని కేసీఆర్ అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. వాళ్లు ఇంకెన్ని రోజులు అలాంటి పరిస్థితిలో ఉండాలని ప్రశ్నించారు. స్వాతంత్ర వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటినా రైతు సోదరుల ఆత్మహత్యలు తనను కలచి వేస్తున్నాయని అన్నారు. ఇవన్నీ ఆ రెండు ప్రభుత్వాల విధానాల కారణంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇకపై దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండదని.. రైతు ఫ్రెండ్లీ, అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలు అవుతున్న ప్రతీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఒకప్పుడు తాగు, సాగు నీరు లేక ఇబ్బందులు పడిన తెలంగాణలో ఇవ్వాళ పరిస్థితులు అన్నీ మారిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కేవలం కరెంట్ ఇవ్వడంతోనే ఆగిపోలేదని.. మోటార్లు పెట్టుకున్నా అడ్డు చెప్పకుండా వారిని స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోనిస్తున్నామని చెప్పారు.

ఏ రైతైనా అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే నాలుగు రోజుల్లోనే ఆ కుటుంబానికి బీమా డబ్బులు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణలో ప్రభుత్వమే పండించి పంటను మొత్తం కొంటోందని వెల్లడించారు. రైతు బంధు, దళిత బంధు పేరిట ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని.. ఒక్క తెలంగాణలోనే ఈ పథకాల వల్ల ఎంతో మంది తమ సొంత కాళ్లపై నిలబడ్డారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 


Tags:    
Advertisement

Similar News