ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీలో స్కూళ్లకు బెదిరింపులు రావడం ఈ వారంలో ఇది రెండోసారి
ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జి స్కూల్ తో పాటు మరో స్కూల్‌కు ఈ తెల్లవారుజామున బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యాలు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్ ఇంజన్స్, బాంబ్ నిర్వీర్యం చేసే దళాలతో స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆయా పాఠశాలలు నేడు సెలవు ప్రకటించాయి. అయితే బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు. ఢిల్లీలో స్కూళ్లకు బెదిరింపులు రావడం ఈ వారంలో ఇది రెండోసారి అని సమాచారం. ఈ నెల 9వ తేదీన కూడా 44 స్కూళ్లలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.