ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులంతా సేఫ్
ముంబాయి నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. బాంబు బెదిరింపునకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో అందులో 239 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.ఈ విమానం ప్రస్తుతం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నది. విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది భద్రతను కోసం అన్ని ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.
మూడు రోజుల కిందట కూడా ఎయిరిండియా విమానానికి ఈ తరహా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తింది. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి బయలుదేరిని కొద్దిసేపటికే ఈఘటన జరిగింది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో విమానం సేఫ్‌గా ల్యాండింగ్ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ల్యాండింగ్ కోసం యత్నించిన పైలట్లు.. సుమారు రెండు గంటల ఆపటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన విషయం విదితమే.