త్వరలో రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్..!
అభిషేక్ తల్లి జయా బచ్చన్ కూడా ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ తల్లిదండ్రుల బాటలోనే నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం. ఆయన తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసిన ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానం నుంచే అభిషేక్ ఇప్పుడు పోటీ చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
సమాజ్‌వాదీ పార్టీ తరఫున..!
అభిషేక్ తల్లి జయా బచ్చన్ కూడా ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌ను కూడా ఎన్నికల బరిలో దించాలని సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్టు సమాచారం. అభిషేక్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ప్రచారంపై ఇంతవరకూ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
అప్పట్లో అమితాబ్.. భారీ మెజారిటీతో..
అమితాబ్ బచ్చన్ 1984లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ కోరిక మేరకు ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై ఆయన లక్షకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.