75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో.... ఇంకెన్నాళ్ళీ హృదయవిదారక సంఘటనలు !?

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ నాలుగేళ్ళ పాప ప్రమాద వశాత్తు మరణించింది. దాంతో ఆ పాప డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం ఛతర్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అయిపోయాక ఆ చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్ళేందుకు ఆ పాప మేనమామ పడ్డ కష్టాలు వర్ణనాతీతం.

Advertisement
Update:2022-10-20 14:46 IST

75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో కనీసం ఇప్పటికీ ప్రజల మౌలిక అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి ఎందుకున్నట్టు ? కడుపుకింత తిండి, విద్యా, వైద్యం...తదితర అతి ముఖ్యమైన అవసరాలు కూడా తీరని జనం ఇప్పటికీ కోట్లల్లో ఎందుకున్నట్టు? 5లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను చేస్తామని, ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, 8 నుంచి 10 శాతం జీడీపీ అంటూ చంకలు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్న పాలకులు కనీసం ఆస్పత్రిలో చనిపోయిన పేద వారికి అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో ఎందుకున్నట్టు ?

ఈ మధ్య కాలంలో ఎన్ని సంఘటనలు చూస్తున్నాం ! వింటున్నాం! అంబులెన్స్ లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకొని కిలో మీటర్ల దూరం నడిచిన తండ్రి... కూరగాయలమ్ముకునే నాలుగు చక్రాల బండిలో భర్త శవాన్ని వేసుకొని తోసుకెళ్ళిన భార్య....ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఓ సంఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడిక మధ్యప్రదేశ్ లో...

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఓ నాలుగేళ్ళ పాప ప్రమాదవశాత్తు మరణించింది. దాంతో ఆ పాప డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం ఛతర్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అయిపోయాక ఆ చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్ళేందుకు ఆ పాప మేనమామ పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అతని దగ్గర కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. ఆస్పత్రి కనీసం అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. కనీసం పట్టించుకోలేదు.పాప‌ శరీరాన్ని తన చేతుల్లో పెట్టుకుని, అంబులెన్స్ ను వెతుక్కుంటూ తిరిగాడు అతను. ప్రైవేటు అంబులెన్స్ లో వెళ్ళడానికి అతని వద్ద డబ్బులు లేవు.

ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను తన మేనకోడలు మృతదేహాన్ని మోసుకొని నడుచుకుంటూ బస్టాండ్ కు వెళ్ళాడు. తన ఊరు వెళ్ళడానికి అత్యంత రద్దీగా ఉన్న బస్సులో ఎక్కాడు. పాపం అతని వద్ద బస్సు టిక్కట్ కు కూడా డబ్బులు లేవు. దాంతో దయతలచిన పక్కవాళ్ళు టిక్కట్ కొనిచ్చారు.

అతను తన మేనకోడలు మృతదేహాన్ని భుజంపై వేసుకొని నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజ‌నుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన ఆస్పత్రి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ, ఇందులో వైద్యుల పాత్ర ఉండదని చెప్పారు. ''మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడం పట్టణాభివృద్ధి శాఖ పని. ఆసుపత్రిని, దాని వైద్యులను ఇందులోకి లాగవద్దని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను, "అని అతను అన్నాడు.

ఇదే జిల్లాలో నాలుగు నెలల క్రితం ఇలాంటి స‍ంఘటనే జరిగింది. నాలుగు నెలల క్రితం ఆస్పత్రిలో చనిపోయిన ఓ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లేక ఓ కుటుంబం ఆ పాపను భుజాలపై మోసుకెళ్ళారు. ఈ నాలుగు నెలల్లో ఇది రెండో సంఘటన.

నిన్న ఇదే రాష్ట్రంలో సింగ్రౌలీ జిల్లాలో మరో సంఘటన జరిగింది. తమ చనిపోయిన శిశువును తీసుకెళ్ళడానికి ఆసుపత్రి అంబులెన్స్ నిరాకరించడంతో ఓ జంట తమ శిశువును బైక్ సైడ్ బాక్స్ లో పెట్టి తీసుకెళ్ళారు. వారు జిల్లా కలెక్టర్ సహాయం కోరారు. ఆ పాప మృతదేహాన్ని చూపించమని కలెక్టర్ అడిగినప్పుడు వారు బైక్ సైడ్ బాక్స్ లోని ఓ బ్యాగ్ నుండి శిశువు మృతదేహాన్ని బైటికి తీసి చూపించిన ఘ‌టన ఎంత హృదయ విదారకంగా ఉంటుందో...ఆ తల్లి తండ్రుల గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతాయో ఆలోచించండి.

మధ్యప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి హృదయవిదారక ఘటనలు రోజుకొకటి చొప్పున జరుగుతున్నా పాలకులు నిర్లక్ష్యంగా ఉండటంలో అర్దం ఏంటి ?


Tags:    
Advertisement

Similar News