బీజేపీలో ముసలం.. హిమాచల్ లో ఓటమి ఖాయం..!

ఇటీవలే నలుగురు మాజీ ఎమ్మెల్యేలను, ఓ మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. తాజాగా.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిపైనే వేటు పడింది.

Advertisement
Update:2022-11-02 09:12 IST

48మంది ఎమ్మెల్యేలలో 11మందికి టికెట్లు ఇవ్వలేదు. మరో ఐదుగురికి స్థాన చలనం కలిగించింది బీజేపీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బీజేపీ చేసిన ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. మూడు సస్పెన్షన్లు, ఆరు బుజ్జగింపులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. హిమాచల్ లో జైరామ్ ఠాకూర్ ప్రభుత్వంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది, దానికితోడు ఇప్పుడు రెబల్స్ బాధతో బీజేపీ పూర్తిగా చతికిలపడిపోయింది.

68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 12న జరగాల్సి ఉంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడతాయి. హిమాచల్ లో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చూస్తున్న బీజేపీ, దానికోసం ప్రయోగాలు మొదలుపెట్టింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోడానికి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా ఆపింది. మరికొంతమందికి సీట్లు మార్చింది. దీంతో 11మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు పార్టీ మారారు, మిగతా ఐదుగురు రెబల్స్ గా పోటీలో దిగారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది.

చేతులు కాలాక..

తీరా ఇప్పుడు చేతులు కాలాక బీజేపీ ఆకులు పట్టుకోవాలని చూస్తోంది. రెబల్స్ పై వేటు వేసినా ఇప్పటికిప్పుడు బీజేపీకి కలిగే ప్రయోజనం ఏంటో అర్థం కావడంలేదు. కానీ మిగతా వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో రెబల్స్ పై వేటు వేస్తోంది హిమాచల్ ప్రదేశ్ బీజేపీ. ఇటీవలే నలుగురు మాజీ ఎమ్మెల్యేలను, ఓ మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. తాజాగా.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిపైనే వేటు పడింది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్‌ సింగ్‌ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది అధిష్టానం.

కులు సీటుపై పీటముడి..

కులు అసెంబ్లీ సీటుకు బీజేపీ నరోత్తమ్‌ ఠాకూర్ ని అభ్యర్థిగా ప్రకటించింది. ఈయనపై రామ్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోయే సరికి పార్టీ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్లపాటు రామ్ సింగ్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ సింగ్‌ సైతం కులు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకున్నారు. చివరకు ఆయన బుజ్జగింపులకు లొంగారు. రామ్ సింగ్ లొంగకపోయే సరికి వేటు పడింది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందనే సంకేతాలున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఏ సర్వే కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పలేదు.

Tags:    
Advertisement

Similar News