ముందు ఈడీ, సీబీఐ.. ఆ తర్వాత మోదీ

మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దఫాలు ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారామె.

Advertisement
Update:2023-02-11 06:50 IST

ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మోదీ ప్రచారానికి వచ్చే ముందుగా సీబిఐ, ఈడీ వస్తాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత. '2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు?' అనే అంశంపై చెన్నైలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కేంద్ర ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శించారు. హామీలు అమలులో విఫలమై, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దెబ్బతీసిన బీజేపీ 2024 లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని అభిప్రాయపడ్డారు. పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దఫాలు ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారామె.


అన్నీ అబద్ధాలే..

2014లో 11.47 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకం ప్రారంభించారని.. ఈ ఏడాది కేవలం 3.80 కోట్ల మంది రైతులకు మాత్రమే ఆర్థిక సాయం చేశారని చెప్పారు. కానీ పార్లమెంట్ లో ప్రసంగించిన మోదీ, ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు ఈ పథకం అమలు చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే 50 వేలమందిని పీఎం కిసాన్ నుంచి తొలగించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోదీ, రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారన్నారు. పార్లమెంటులో గంటన్నర సేపు మాట్లాడిన మోదీ, అదానీ కుంభకోణంపై ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు కవిత. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికేడాది రైతుబంధు నిధుల్ని పెంచుకుంటూ పోతే, కేంద్రం పీఎం కిసాన్ నిధులను తెగ్గోస్తోందని, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేస్తోందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిందన్నారు. అన్నింటా పూర్తిగా విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోతే, అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని కవిత ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఆ పని చేస్తుంది..

దేశవ్యాప్తంగా భావ సారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను బీఆర్ఎస్ ఐక్యం‌ చేస్తుందని అన్నారు కవిత. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికార మార్పు ఖాయమని చెప్పారామె. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తెలంగాణ మోడల్ ని దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News