రాహుల్ గాంధీ యాత్ర ను ఆపేయాలన్న బీజేపీ... తమ యాత్ర మాత్రం కొనసాగుతుందని వెల్లడి

కోవిడ్ కారణంగా తమ యాత్ర రద్దు చేసుకుంటున్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీజేపీ మాట మార్చి యూటర్న్ తీసుకుంది. ‘జన్ ఆక్రోశ్ యాత్ర’ కొనసాగుతుందని ఇప్పటి వరకు ఆ యాత్రలో తాము నిర్వహిస్తున్న బహిరంగ సభలు కొనసాగిస్తామని బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు.

Advertisement
Update:2022-12-24 08:25 IST

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా మన దేశంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అందువల్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన‌ భారత్ జోడో యాత్ర నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాహుల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ లో బీజేపీ సాగిస్తున్న 'జన్ ఆక్రోశ్ యాత్ర' మాత్రం కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల పెరుగుదలపై మూడు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆందోళన వ్యక్తం చేశారు.వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం , హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు.

అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులు డిసెంబరు 22నుండి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించడం ప్రారంభించినట్లు కూడా మంత్రి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీతో సహా పార్లమెంట్‌లో చాలా మంది మంత్రులు కూడా మాస్క్‌లు ధరించి కనిపించారు.

COVID-19 ప్రోటోకాల్‌లను అనుసరించలేకపోతే 'భారత్ జోడో యాత్ర'ని నిలిపివేయాలని ఆరోగ్య మంత్రి మాండవ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.

దీంతో అనేక విమర్శలు రేగాయి. భారత్ జోడో యాత్ర కు వస్తున్న స్పందన చూసి బీజేపీ దాన్ని ఆపాలని కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో తాము నిర్వహిస్తున్న 'జన్ ఆక్రోశ్ యాత్ర'ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ ప్రకటించింది.

రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా డిసెంబర్ 1న రాష్ట్రంలో 'జన్ ఆక్రోశ్ యాత్ర'ను ప్రారంభించారు.

"కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో బీజేపీ 'జన్ ఆక్రోశ్ యాత్ర'ని సస్పెండ్ చేసింది. బీజేపీకి రాజకీయాల కంటే ప్రజలే ముఖ్యం. మాకు ప్రజల భద్రత, వారి ఆరోగ్యమే ప్రధానం'' అని డిసెంబర్ 22, గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు.'భారత్ జోడో యాత్ర' కూడా నిలిపి వేయాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు.

అయితే, కొన్ని గంటల్లోనే బీజేపీ మాట మార్చి యూటర్న్ తీసుకుంది. 'జన్ ఆక్రోశ్ యాత్ర' కొనసాగుతుందని ఇప్పటి వరకు ఆ యాత్రలో తాము నిర్వహిస్తున్న బహిరంగ సభలు కొనసాగిస్తామని బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు.

''ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'జన్ ఆక్రోశ్' సభలు నిర్వహించాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. దాని వల్ల‌ కొంత గందరగోళం నెలకొంది. కానీ మా బహిరంగ సభలు జరుగుతాయి, "అని ఓ వీడియో ప్రకటనలో సతీష్ పూనియా అన్నారు.

దీన్ని బట్టి తమ యాత్రలు, బహిరంగ సభలు మాత్రం కొనసాగాలని విపక్షాల సభలు, యాత్రలు మాత్రం రద్దు చేసుకోవాలని బీజేపీ కోరుకుంటొందని అర్దమవుతోంది.

Tags:    
Advertisement

Similar News