కూతుర్లపై గురి పెడదాం.. తండ్రులను భయపెడదాం!

ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు ఇచ్చిన సూచనలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గురించి సమావేశంలో ఎక్కువగా అమిత్ షా ప్రస్తావించారు. మహారాష్ట్రలో పవార్‌ను కట్టడి చేయాలని నిర్దేశించారు.

Advertisement
Update:2022-09-12 09:52 IST

దేశంలో మారుతున్న పరిణామాలను తమకు అశుభ సంకేతాలుగా బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. 2014లో యూపీఏ చిత్తుగా ఓడిపోవడానికి రెండేళ్ల ముందు నుంచి అప్పటి కాంగ్రెస్‌కు ఇలాంటి సవాళ్లు ఏకకాలంలో పలు దిశల నుంచి చుట్టుముట్టిన అంశాన్ని బీజేపీ నేతలు బేరీజు వేసుకుంటున్నారు.

అందుకే అమిత్ షా పదేపదే బీజేపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసమర్థ‌త, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పదవుల నుంచి పీకిపడేస్తామని ఆయన అంతర్గత సమావేశాల్లో స్పష్టంగా చెబుతున్నారు. పురందేశ్వరిని ఇన్‌చార్జ్ పదవుల నుంచి తొలగించడం కూడా ఇందులో భాగమే. కాంగ్రెస్‌నే కాకుండా బలమైన ప్రాంతీయ పార్టీల నేతల దూకుడుపైనా అమిత్ షా ఆందోళనతో ఉన్నారు.

ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు ఇచ్చిన సూచనలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గురించి సమావేశంలో ఎక్కువగా అమిత్ షా ప్రస్తావించారు. మహారాష్ట్రలో పవార్‌ను కట్టడి చేయాలని నిర్దేశించారు. ప్రత్యేకమైన పథకాలతో ఆదర్శంగా నిలవడంతో పాటు.. హిందీపై గట్టి పట్టున్న కేసీఆర్‌ రాష్ట్రం వెలుపల పర్యటనలు చేస్తే ఇబ్బంది వస్తుందన్నది బీజేపీ నేతల ఆలోచన. అందుకే కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం దాటి దేశ రాజకీయాల్లోకి వేలుపెట్టే పరిస్థితి లేకుండా దాడి చేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా సూచించినట్టు చెబుతున్నారు.

రాష్ట్రంలోనే తీవ్రస్థాయిలో దాడి చేయడం ద్వారా.. కేసీఆర్‌ను సొంత రాష్ట్రంలోనే బిజీ అయ్యేలా చేయాలని ఆదేశించినట్టు సమాచారం. కేసీఆర్‌, శరద్ పవార్‌లను కట్టడి చేసి ఆత్మరక్షణలో పడేసేందుకు వారి కుమార్తెలపైనా గురి పెట్టాలని అమిత్ షాతో జరిగిన భేటీలో నిర్ణయించిన సమాచారం తమకుందని టీఆర్‌ఎస్ వర్గాలే చెబుతున్నాయి.

కేసీఆర్ కుమార్తె కవిత, పవార్ కుమార్తె సుప్రియను టార్గెట్‌ చేసుకుని మరిన్ని ఆరోపణలు చేయాలని, ఏమాత్రం దూకుడు పెంచినా తన కుమార్తెలకు ఇబ్బంది వస్తుందన్నట్టుగా తండ్రులను ఆత్మరక్షణలో పడేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. నేతల కుమార్తెలను టార్గెట్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అండ్ టీంకు అమిత్ షా అప్పగించినట్టు టీఆర్ఎస్‌ వర్గాలకు సమాచారం అందింది.

Tags:    
Advertisement

Similar News