ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేసిన బీజేపీ
'ఆపరేషన్ లోటస్' స్కామ్ ద్వారా కాషాయ పార్టీ గెలుపు కోసం కొత్త ఎత్తగడలు వేస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాలో ఆ పార్టీ అవకతకలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నది. తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైపోయింది. వారికి సీఎం అభ్యర్థి లేరు. దార్శనికత, విశ్వాసం కలిగిన వ్యక్తులు లేరు. అందుకే కాషాయ పార్టీ గెలుపు కోసం కొత్త ఎత్తగడలు వేస్తున్నది. ఎన్నికలను ప్రభావితం చేయడానికి 'ఆపరేషన్ లోటస్' స్కామ్ ద్వారా డిసెంబర్ 15 నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
కొన్నిరోజులుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తన ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఈ 15 రోజుల్లో 5 వేల మంది ఓటర్లను తొలిగించడానికి కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. అంతేగాకుండా .. 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చడానికి అప్లికేషన్లు వచ్చాయి. 12 శాతం ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయి అని కేజ్రీవాల్ అన్నారు.