గుజరాత్ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం.. మరో 12మందిపై వేటు

రెబల్స్ అందర్నీ ఇప్పుడు పార్టీనుంచి సాగనంపింది బీజేపీ అధిష్టానం. అంటే గుజరాత్ ఎన్నికల సందర్భంగా మొత్తం 19మంది సీనియర్ నాయకులపై సస్పెన్షన్ వేటు పడిందన్నమాట.

Advertisement
Update:2022-11-23 13:02 IST

పోలింగ్ కి రోజులు దగ్గరపడేకొద్దీ బీజేపీలో ముసలం పెరిగి పెద్దదై ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తొలి విడత నామినేషన్ల పర్వంలో ఏడుగురు రెబల్స్ పై బీజేపీ వేటు వేసింది. తాజాగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి మరో 12మందిపై వేటు పడింది. ఇందులో ఓ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం.

అతి జాగ్రత్తతో అవస్థలు..

గుజరాత్ లో వరుసగా ఆరు దఫాలు బీజేపీ అధికారంలో ఉంది. ఏడోసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ని పూర్తిగా డమ్మీ చేసి మోదీ-షా ద్వయం ఇక్కడ చక్రం తిప్పుతోంది. అభ్యర్థుల విషయంలో కూడా స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా పోయింది. గెలుపే పరమావధిగా కాస్ట్ లీ అభ్యర్థులను వెదికి పట్టుకుంది. దీంతో సహజంగానే ఆశావహులు ఇబ్బంది పడుతున్నారు. సిట్టింగ్ లకు కూడా టికెట్లు ఇవ్వలేదు. మరికొంతమందికి స్థాన చలనం కలిగింది. వీరంతా తిరుగుబాటు జెండా ఎగరేశారు.

డిసెంబర్-1న జరగాల్సిన తొలిదశ ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేసిన ఏడుగురిని బీజేపీ ఇదివరకే సస్పెండ్ చేసింది. ఇక డిసెంబర్-5న ఎన్నికలకోసం ఇటీవలే నామినేషన్లు పూర్తయ్యాయి. నవంబర్-21 న నామినేషన్ల ఉపసంహరణ వరకు అధిష్టానం వేచి చూసింది. బుజ్జగించింది, బెదిరించింది, కానీ ఫలితం లేదు. మొత్తం 12మంది బీజేపీ టికెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. వారందర్నీ ఇప్పుడు పార్టీనుంచి సాగనంపింది అధిష్టానం. అంటే గుజరాత్ ఎన్నికల సందర్భంగా మొత్తం 19మంది సీనియర్ నాయకులపై సస్పెన్షన్ వేటు పడిందన్నమాట.

గతంలో ఎప్పుడూ ఏ అసెంబ్లీ ఎన్నికలకోసం ఈ స్థాయిలో బీజేపీ సస్పెన్షన్ వేటు వేయలేదు. తొలిసారి గుజరాత్ లో రెబల్స్ బెడద పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. అటు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనపడే అవకాశముంది. రెబల్స్ ని తప్పించారు కానీ, ఎన్నికల్లో వారి ప్రభావాన్ని మాత్రం బీజేపీ ఎదుర్కోవాల్సిందే. ఆయా నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్, ఆప్ అంచనా వేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News