రాముడిని నమ్ముకున్న బిజెపి చెడిపోలేదు!

అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా 1990 సెప్టెంబర్‌ 25న బిజెపి అధినేత ఎల్‌.కె. అద్వానీ రథయాత్ర చేపట్టారు. నాడు కేంద్రంలో ప్రధానమంత్రి వి.పి. సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఉంది.

Advertisement
Update:2024-01-21 09:30 IST

బిజెపి రాముడిని నమ్మింది.. మతాన్ని నమ్మింది.. హిందూత్వాన్ని నమ్ముకుంది.. మతమే తన రాజకీయ భూమిక.. బాహాటంగానే తన ఎజెండాను ప్రకటించింది.. బహిరంగంగానే ఆచరించింది, ఆచరిస్తున్నది.

మతాన్ని నమ్మిన బిజెపి, మత రాజకీయాల ద్వారా అధికారంలోకి రావాలనుకున్న బిజెపి తన పంథాను వీడలేదు. మొదట్నించి హిందూత్వ ఎజెండాను నమ్మింది. సెక్యులరిజం గురించి ఎవరెన్ని మాట్లాడినప్పటికీ హిందూత్వ రాజకీయాలనే శిరోధార్యంగా భావించింది. హిందూత్వం ద్వారానే అధికారం కైవసం చేసుకోవాలనుకుంది. తన ఎజెండాను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. తప్పో ఒప్పో హిందూత్వానికి కట్టుబడి వుంది. భారతీయ జనతాపార్టీ హిందూత్వ సిద్ధాంతాలను వీడలేదు. రామజన్మభూమి నినాదం, రామాలయ నిర్మాణం తన లక్ష్యమని మొదటే ప్రకటించింది. ఆ దిశగానే తన ప్రయాణం సాగించింది.

కానీ, సెక్యులరిస్టులమనుకునేవారే దారి తప్పారు. లౌకికవాద నినాదాలు ఇస్తూనే మత రాజకీయాలకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా నిర్దిష్టంగా లౌకికవాద ఎజెండాకు కట్టుబడి వుండలేదు. అనేకసార్లు అవకాశవాదాన్ని ప్రదర్శించింది. సెక్యులరిజం గురించి చెబుతూనే భిన్నవైఖరులు తీసుకుంది. ఎక్కడ ఏ పాట పాడాలో అక్కడది పాడింది.

అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా 1990 సెప్టెంబర్‌ 25న బిజెపి అధినేత ఎల్‌.కె. అద్వానీ రథయాత్ర చేపట్టారు. నాడు కేంద్రంలో ప్రధానమంత్రి వి.పి. సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఉంది. దానికి బిజెపి మద్దతు ఉంది. బిజెపి మద్దతుగల ఆ ప్రభుత్వానికి కమ్యూనిస్టుల మద్దతు కూడా వుంది. అద్వానీ రథయాత్రని నాటి ప్రధాని వి.పి.సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

1990 అక్టోబర్‌లో అద్వానీ రథయాత్ర బిహార్‌లోకి ప్రవేశించింది. నాడు బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌. రథయాత్ర వల్ల చెలరేగుతున్న మతోన్మాద హింసని సహించలేకపోయారు. రథయాత్రను ఆపాలని, అద్వానీని అరెస్టు చేయాలని తలపోశారు. వి.పి.సింగ్‌ కూడా రథయాత్రని ఆపాలని పట్టుదలతో ఉన్నారు. అద్వానీ అరెస్టుకు లాలూను అనుమతించారు. మొదట బిహార్‌లోని ధన్‌బాద్‌కు రథయాత్ర చేరుకున్న వెంటనే అరెస్టు చేయాలనుకుంటే స్థానికంగా ఉన్న పోలీస్‌ అధికారులు సాహసించలేదు. ఆ తరువాత రథయాత్ర పాట్నాకు చేరుకుంది. అక్టోబర్‌ 23న అక్కడ అతి పెద్ద బహిరంగసభ జరిగింది. రథయాత్రను ఆపడం తప్పనిసరి అని భావించారు లాలూ. మరోసారి నాటి ప్రధాని వి.పి.సింగ్‌తో సంప్రదించగా అద్వానీ అరెస్టుకు సమ్మతి తెలిపారాయన. పాట్నా నుంచి సమస్తిపూర్‌ చేరింది అద్వానీ రథయాత్ర. అక్కడ బిహార్‌ పోలీస్‌ అధికారులు అద్వానీని అరెస్టు చేసి రథయాత్రని నిలువరించారు.

ఆ తదుపరి అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో 11 మాసాల వి.పి. సింగ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. అద్వానీ రథయాత్రని ఆపితే తన ప్రభుత్వం కూలిపోతుందని వి.పి.సింగ్‌కు తెలుసు. అయినా అందుకు సిద్ధపడ్డారు. లౌకకివాదం విషయంలో రాజీపడలేదు. అద్వానీ అరెస్టు అనంతర పరిణామాలు ఎలా ఉంటాయో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కూడా తెలుసు. అందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ దేశంలో వందలకోట్ల అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రులు నిక్షేపంగా ఉండగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రమే జైలు పాలయ్యారు.

లౌకికవాద ఎజెండా విషయంలో గత 33 సంవత్సరాల కాలంలో లాలూ ఒక్కరే ఏనాడూ రాజీపడలేదు. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ బిజెపితో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ స్థాయిలోనూ పొత్తులు పెట్టుకోలేదు. బిజెపి హిందూత్వ రాజకీయాలను ఏమాత్రం రాజీపడకుండా వ్యతిరేకించిన ఏకైక పార్టీ ఆర్‌జెడీ, ఏకైక నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌.

లౌకికవాదం గురించి మాటలెన్నో చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ బాబ్రీ మసీదు` రామజన్మభూమి వివాదం అంశంలో స్పష్టమైన విధానాన్ని అనుసరించలేదు. చివరకు నాటి ప్రధాని పి.వి. నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బాబ్రీ మసీదు కూల్చివేతకు మౌనసాక్షిగా నిలిచింది. తన మౌనంతో బాబ్రీ విధ్వంసాన్ని అనుమతించారు పి.వి. నరసింహారావు.

బిజెపి మత రాజకీయాలు తెలిసినప్పటికీ, గుజరాత్‌ గోద్రా అల్లర్లు, అనంతర మారణకాండ తెలిసినప్పటికీ ఈ దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు విభిన్న సందర్భాలలో బిజెపితో జత కట్టాయి. తెలుగుదేశం పార్టీ, ఎన్‌సిపి, తృణమూల్‌ కాంగ్రెస్‌, నితీష్‌కుమార్‌ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్‌పి, అన్నా డిఎంకె, డిఎంకె వంటి పార్టీలు వివిధ సందర్భాలలో బిజెపితో పొత్తు పెట్టుకున్నాయి. సర్దుబాట్లు చేసుకున్నాయి. ఇలాంటి రాజకీయ పార్టీలతో లౌకికవాదం గురించి సుద్దులు చెప్పే వామపక్షాలు కూడా అనేకసార్లు చేతులు కలిపాయి. సెక్యులరిజం గురించి ఎన్నో మాటలు చెప్పే వీరు `బిజెపితో జతకట్టిన వారితో తాము జతకట్టడం సూత్రరీత్యా తప్పని కమ్యూనిస్టులు భావించలేదు.

ఇంతకీ విషయమేమంటే `

బిజెపికి తను నమ్ముకున్న హిందూత్వం మీద నమ్మకముంది. తను నమ్ముకున్న రాముడి మీద బలమైన నమ్మకముంది. రాముడి లానే ఒకే మాట మీద నిలబడింది. రామాలయ నిర్మాణం అనే లక్ష్యాన్ని, నినాదాన్ని వీడలేదు. ప్రతి అడుగునూ ఈ లక్ష్యసాధన దిశగానే వేసింది. అయోధ్యలో రామాలయం అనే 'కల'ను సాకారం చేసుకుంది.

లౌకికవాదం గురించి మాట్లాడేవారు మాత్రం లౌకికవాదం మీద నిలబడలేదు. చేతల్లో భిన్నంగా వ్యవహరించారు. లౌకికవాద ఎజెండాకు కట్టుబడకుండా ఎత్తుగడల పేరిట కుప్పిగంతులెన్నో వేశారు. మనసా, వాచా, కర్మణా లౌకికతత్వాన్ని అనుసరించలేదు. అందుకునే తన వైరిపక్షాలది కూహనా లౌకికవాదం అని బిజెపి అంటే జనాలు నమ్మారు. వీళ్ళంతా కుహనా లౌకికవాదులు అంటే అవును కాబోలు అనుకున్నారు.

ఏమైతేనేం రాముడిని నమ్ముకున్న బిజెపి చెడిపోలేదు!

Tags:    
Advertisement

Similar News