మనీష్ సిసోడియా హత్యకు బీజేపీ కుట్ర..? ఆప్ సంచలన ఆరోపణలు
బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, వ్యతిరేకించే నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు ఆప్ నేతలు. రాజకీయంగా ఓడించలేము అనుకుంటే.. అలాంటివారిని జైలుకి పంపుతున్నారని విమర్శించారు.
తీహార్ జైలులో మనీష్ సిసోడియాను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన్ను హతమార్చేందుకు ఉద్దేశపూర్వకంగా తీహార్ జైలులో వేశారని, అందులో ఒకటో నెంబర్ సెల్ ని ఆయనకు కేటాయించారని చెప్పారు. ఆ ఒకటో నెంబర్ సెల్ లో కరడుగట్టిన నేరస్తులు ఉంటారని, వారితో మనీష్ ని చంపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఆప్ అధికార ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్.
వారిమధ్య సిసోడియా ఎందుకు..?
తీహార్ జైలులో ఒకటో నెంబర్ సెల్ లో మానసిక అలజడితో బాధపడే నేరగాళ్లను ఉంచుతారని, వారికి సిగ్నల్ ఇస్తే చాలు, ఎవరినైనా చంపేస్తారని అన్నారు ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్. ఢిల్లీలో ఆప్ ను ఓడించలేని బీజేపీ, ఇలాంటి పద్ధతుల్లో ప్రత్యర్ధులను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పాలైందని, ఆ ఓటమికి ప్రధాని మోదీ ఇలా పగతీర్చుకుంటారా అని ప్రశ్నించారాయన. సిసోడియా అరెస్ట్ పై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు.
రాజకీయ ప్రతీకార కుట్రలు..
బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, వ్యతిరేకించే నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు ఆప్ నేతలు. రాజకీయంగా ఓడించలేము అనుకుంటే.. అలాంటివారిని జైలుకి పంపుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. మోదీకి ప్రధాని పదవి దూరమయ్యే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఇటీవల దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్ట్ లు ఎక్కువయ్యాయన్నారు.