నలుగురు పిల్లలున్న బీజేపీ ఎంపీ జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు!
జనాభా నియంత్రణ కోసం పార్లమెంటు లో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఆయనకు నలుగురు పిల్లలుండటం విశేషం.
రవి కిషన్ బీజేపీ ఎంపీగానే కాక తెలుగు వారికి నటుడిగా సుపరిచితుడు. తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ వేసే రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పార్లమెంటు సభ్యుడు. ఆయనకు నలుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు కుమార్తెలు కాగా ఒక కుమారుడు. అందులో తప్పేమీ లేదు కానీ ఇప్పుడీయన భారత్ దేశంలో జనాభా నియంత్రణ కోసం ప్రతిన బూనారు. దాని కోసం పార్లమెంటులో ఓ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు.
''జనాభా నియంత్రణ బిల్లు తెచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభాను అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యం'' అని కిషన్ మీడియాతో అన్నారు.
"ఇలా పెరుగుతున్న జనాభాతో మనం దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నాం.కాబట్టి బిల్లును ప్రవేశపెట్టడానికి నన్ను అనుమతించమని నేను ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాను.'' "అని రవి కిషన్ కోరారు.
వచ్చే ఏడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలబడుతుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
2045 నాటికి జనాభాను స్థిరీకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, జనాభా పెరుగుదలను అదుపు చేయడంలో తమ ప్రయత్నాలు విజయవంతమయ్యాయని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణ కోసం రవి కిషన్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అయితే నలుగురు పిల్లలున్న రవి కిషన్ జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని సోషల్ మీడియాలో నెటిజనులు ఎండగడుతున్నారు.
మరో వైపు జనాభా నియంత్రణ బిల్లు ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెడుతున్న బిల్లు అనే విమర్షలు కూడా వస్తున్నాయి.