లంచం కేసులో ట్విస్ట్.. కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

అతను విచారణకు సహకరించడంలేదంటూ లోకాయుక్త, కోర్టుని ఆశ్రయించడంతో బెయిల్ రద్దు అయింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షప్పను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు.

Advertisement
Update:2023-03-28 06:21 IST

లంచం కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. విచారణకు ఆయన సహకరించడం లేదంటూ లోకాయుక్త వేసిన పిటిషన్ పై కర్నాటక హైకోర్టు స్పందించింది. విరూపాక్షప్ప బెయిల్ రద్దు చేసింది. దీంతో ఆయన అరెస్ట్ అయ్యారు.

కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కి చైర్మన్ గా ఉన్న విరూపాక్షప్ప.. దానికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ తన కుమారుడు ప్రశాంత్ తో చక్కబెట్టేవారు. కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం.. అంతా ప్రశాంత్ పని. అయితే ఓ కాంట్రాక్టర్ ని లంచం కోసం తీవ్రంగా వేధించడంతో.. అతడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు.

విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్‌ మార్చి 2న ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత విరూపాక్షప్ప నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అయితే ముందస్తు బెయిల్ తో విరూపాక్షప్ప అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతను విచారణకు సహకరించడంలేదంటూ లోకాయుక్త కోర్టుని ఆశ్రయించడంతో బెయిల్ రద్దు అయింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షప్పను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ..

కర్నాటకలో కమీషన్ రాజ్ నడుస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. కమీషన్ లేనిదే ఎక్కడా ఏ పని కూడా జరగదు. ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు విరూపాక్షప్ప కొడుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ అవినీతి ఆరోపణలు బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. 

Tags:    
Advertisement

Similar News