పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతూ... తమ ప్రచారం కోసం 900 కోట్లకు పైగా ఖర్చు చేసిన కేంద్ర సర్కార్

ప్రజల అవసరాల కోసం ఒక్క పైసా ఇవ్వకుండా, పన్నులు మాత్రం నడ్డి విరిగేలా వేస్తున్న కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ప్రచారం కోసం 900 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.

Advertisement
Update:2022-07-23 15:59 IST

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పేరుతో పన్నులు పెంచుతూ, బడా పారిశ్రామిక వేత్తల రుణాలమాఫీకి లక్షల కోట్లు, తన గొప్పతనాల ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మాత్రమే ఉపయోగపడే ప్రచారం కోసం బీజేపీ ప్రభుత్వం 2019 నుండి ఈ ఏడాది జూన్ వరకు 911కోట్ల17 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇది ఎవరో చెప్పిన నోటి లెక్కలు కావు. స్వయంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంటులో ప్రకటించిన డాటా ఇది.

రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా...

''కేంద్రం 2019 నుండి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రింట్, టెలివిజన్,ఇంటర్నెట్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల కోసం రూ.911.17 కోట్లు ఖర్చు చేసింది.'' అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

2019 నుండి ఈ సంవత్సరం జూన్ వరకు టీవీ ఛానెల్‌లలో ప్రకటనల కోసం ప్రభుత్వం రూ.199.76 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2019 నుంచి 2020 మధ్య కాలంలో 270 ఛానెల్స్‌కు రూ.98.69 కోట్లు ఇవ్వగా.. 2020 నుంచి 2021 వరకు 318 ఛానెళ్ళకుకు రూ.69.81 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. 2021 నుంచి 2022 మధ్య కాలంలో 265 ఛానళ్లపై రూ.29.30 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 99 ఛానళ్లలో ప్రకటనల కోసం రూ.1.96 కోట్లు ఖర్చు చేశారు.

2019 నుండి ప్రింట్ మీడియాలో ప్రకటనల కోస రూ. 690.83 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం

2019 నుంచి 2020 వరకు 5,326 వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం బీజేపీ ప్రభుత్వం రూ.295.05 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 5,210 వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం రూ.197.49 కోట్లు ఖర్చు చేశారు. 2021 నుండి 2022 వరకు 6,224 వార్తాపత్రికలలో ప్రకటనల కోసం ప్రభుత్వం రూ.179.04 కోట్లు ఖర్చు చేసింది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19.25 కోట్లు ఖర్చు చేసింది.

ఇక 2019 నుండి వెబ్ పోర్టల్‌లలో ప్రకటనల కోసం ప్రభుత్వం 20.58 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని ఠాకూర్ చెప్పారు. 2019లో యాడ్‌ల కోసం యాభై నాలుగు వెబ్‌సైట్‌లకు రూ.9.35 కోట్లు, 2020లో 72 వెబ్‌సైట్‌లకు రూ.7.43 కోట్లు, 2021లో 18 సైట్‌లకు రూ.1.83 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 పోర్టల్‌లకు రూ.1.97 కోట్లు వచ్చాయి.

2018 నుంచి 2021 మధ్యకాలంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనల కోసం రూ.1,698.89 కోట్లు ఖర్చు చేసినట్లు డిసెంబర్‌లో కేంద్రం లోక్‌సభకు తెలిపింది.

ఈ ఖర్చు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా ? ఆర్థిక వ్యవ‌స్థకేమైనా ఉపయోగపడుతుందా ? నిజానికి ఈ వందల కోట్ల ఖర్చు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రచారానికి తప్ప ఇంక దేనికి పనికి వచ్చేది కాదు. అదే తెలంగాణలో వరదలొచ్చినా, వరి ధాన్యం కొనాలన్నా ఒక్క పైసా కూడా ఇవ్వడానికి ఇష్టపడని కేంద్రం జనం మీద వేస్తున్న పన్నులను ఇలా వాళ్ళ ప్రచారం కోసం ఉపయోగించడాన్ని ఏమనాలి ?

Tags:    
Advertisement

Similar News