గుజరాత్ ఫలితాల్లో బీజేపీ జోష్.. - హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ
ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిశీలిస్తే.. మొత్తం 68 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరిగాయి. 35 స్థానాలు సాధించుకున్న పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుంది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు గుజరాత్‌లో బీజేపీ రికార్డు విజయం దిశగా దూసుకుపోతోంది. 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92 స్థానాలు సాధించుకున్న పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ మొదలైన తర్వాత ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 126 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో లీడ్‌లో ఉంది. గుజరాత్‌లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 3 స్థానాల్లోనే లీడ్‌లో ఉంది. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సమయానికి మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిశీలిస్తే.. మొత్తం 68 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరిగాయి. 35 స్థానాలు సాధించుకున్న పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుంది. ఇప్పటివరకు వచ్చిన కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉన్నట్టు తెలుస్తోంది. 34 స్థానాల్లో కాంగ్రెస్, 34 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆప్ ఇక్కడ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.
గుజరాత్‌లో బీజేపీ ఈసారి విజయం సాధిస్తే పశ్చిమబెంగాల్‌లో సీపీఎం వరుసగా ఏడుసార్లు విజయం సాధించడం ద్వారా నెలకొల్పిన రికార్డును సమం చేసినట్టవుతుంది. ఈ ఎన్నికలతో పాటు దేశంలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. వాటిలో ఉత్తర ప్రదేశ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.