అమ్మాయిల వస్త్రధారణపై ప్రముఖ బీజేపీ నేత 'చెత్త' కామెంట్స్

హనుమంతుడు, మహావీరుల జయంతి సందర్భంగా గురువారం ఇండోర్‌లో ఏర్పాటు చేసిన మతపరమైన కార్యక్రమంలో బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ, ఈ మధ్య అమ్మాయిలు చెత్త దుస్తులు ధరిస్తున్నారని అలాంటి మహిళలు రామాయణంలోని శూర్పణఖలా కనిపిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-04-08 13:03 IST

భారత్ లో మోరల్ పోలీసింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. మత పెద్దలు, మత సంఘాలు, కరుడుగట్టిన మత చాందసులతో పాటు ఇప్పుడు రాజకీయ నాయకులుకూడా మోరల్ పోలీసింగ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా స్త్రీలపై నైతికత పేరుతో దాడులు చేయడం కొంత కాలంగా పెరిగిపోయింది.

ఈ మోరల్ పోలీసులకు నచ్చినట్టే స్త్రీలు దుస్తులు ధరించాలి. వారి ఇష్టమొచ్చిన ఆహారాన్ని ప్రజలందరూ తినాలి. వాళ్ళు నమ్మిన దేవుళ్ళనే ప్రజలందరూ నమ్మాలి. వారి సిద్దాంతాలనే ప్రజలందరూ పాటించాలి. వాళ్ళ మాటలనే దేశ‌మంతా వల్లెవేయాలి. లేదంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు, బహిరంగ హెచ్చరికలు, దాడులు, హత్యల దాకా పరిణామాలు సాగుతున్నాయి.

ఇప్పుడు స్త్రీల మీద మోరల్ పోలీసింగ్ చేయడానికి బయలుదేరారు ప్రముఖ బీజేపీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా.

హనుమంతుడు, మహావీరుల జయంతి సందర్భంగా గురువారం ఇండోర్‌లో ఏర్పాటు చేసిన మతపరమైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య అమ్మాయిలు చెత్త దుస్తులు ధరిస్తున్నారని అలాంటి మహిళలు రామాయణంలోని శూర్పణఖలా కనిపిస్తారని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“ ఆడపిల్లలు చెత్త‌ బట్టలు వేసుకుంటున్నారు.. మనం ఆడవాళ్ళని దేవతలుగా భావిస్తాం.. కానీ వీళ్ళు మాత్రం శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి బట్టలు వేసుకోండి.. దయచేసి మీ పిల్లలకు మంచి దుస్తులు ధరించడం నేర్పించండి." అన్నారాయన.

స్త్రీలపై విజయవర్గియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపక్షాలు, నెటిజనులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. అతనిని స్త్రీద్వేషిగా అభివర్ణిస్తున్న నెటిజనులు మోరల్ పోలీసింగ్ మానుకోవాలని విజయవర్గియాకు సూచించారు.

బీజేపీ నేతలు మహిళలను పదే పదే అవమానిస్తున్నారని, ఇది వారి ఆలోచనలను, వారి వైఖరిని తెలియజేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంగీతా శర్మ అన్నారు. ''బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ మహిళలను శూర్పణ‌ఖగా పిలువడం, వారి దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం స్వతంత్ర భారతదేశంలో సముచితం కాదు. బీజేపీ నేత స్త్రీలకు క్షమాపణ చెప్పాలి!'' అని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, ఇండోర్‌కు చెందిన ఈ బిజెపి నాయకుడు వివాదాస్పద ప్రకటనలకు ప్రసిద్ది చెందారు.గత నెలలో, భారత దేశం హిందూ దేశమే అని ప్రకటించి సంచలనం సృష్టించారు. 

Tags:    
Advertisement

Similar News