బుజ్జగింపుల్లో విఫలం.. గుజరాత్ లో ఏడుగురు రెబల్స్ పై బీజేపీ వేటు
గుజరాత్ ఎన్నికల్లో రెబల్స్ గా నామినేషన్ వేసిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో అసంతృప్తులు పార్టీపై రగిలిపోతున్నారు. వారంతా లోపాయికారీగా పక్క పార్టీల నేతలకు సపోర్ట్ చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు గట్టిపోటీదారులుగా మారడం ఓవైపు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల తిరుగుబాటు మరోవైపు.. బీజేపీని సతమతం చేస్తున్నాయి. తాజాగా ఏడుగురు రెబల్ అభ్యర్థులపై బీజేపీ వేటు వేసింది. బుజ్జగింపులు విఫలం కావడంతో రెబల్స్ ని పార్టీనుంచి బహిష్కరించింది. ఏడుగురు సీనియర్ నేతల్ని పార్టీనుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు.
ముందుంది ముసళ్ల పండగ..
గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుతం రెబల్స్ గా నామినేషన్ వేసిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో అసంతృప్తులు పార్టీపై రగిలిపోతున్నారు. వారంతా లోపాయికారీగా పక్క పార్టీల నేతలకు సపోర్ట్ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకుండా తమను అవమానించిన పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. పార్టీలో ఉంటూనే పార్టీకి పరాభవాన్ని రుచి చూపించాలని డిసైడ్ అయ్యారు.
రెబల్స్ బెడద ఎందుకు..?
గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. ఏడోసారి అధికారం కోసం ట్రై చేస్తున్న ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్రంలో కూడా బీజేపీయే ఉండటం, అస్తవ్యస్త విధానాలతో ప్రధాని మోదీ అసమర్థ పాలనతో దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తుండటంతో గుజరాత్ లో గెలుపు అందనిద్రాక్షగా మారింది. దీంతో బీజేపీ ప్రయోగాల బాటపట్టింది. మొత్తం 42మంది సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ని కూడా బీజేపీ పక్కన పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏడుగురు కీలక నేతల్లో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ్, ధవల్ సింగ్ ఝాలా వంటి సీనియర్లు ఉన్నారు. వాఘోడియా నుంచి బీజేపీ టికెట్ పై ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవ కూడా ఈసారి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. స్వతంత్రులను అలాగే వదిలేస్తే పార్టీ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ అధిష్టానం.