తేజస్వీని మళ్లీ టార్గెట్ చేసిన బీజేపీ..

తేజస్వీ యాదవ్ దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు తేజస్వీ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Update:2022-09-17 17:28 IST

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ని బీజేపీ మళ్లీ టార్గెట్ చేసింది. జేడీయూకి ఆర్జేడీ స్నేహ హస్తం అందించిన తర్వాత సీబీఐని బీహార్ పైకి ఉసిగొల్పిన కేంద్రం.. 2006 ఐఆర్సీటీసీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసు విచారణ కోసం అంటూ ఆమధ్య ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు చేపట్టింది. తాజాగా మరోసారి తేజస్వీ యాదవ్ ని టార్గెట్ చేసింది కేంద్రం. ఆ కేసులో తేజస్వీ యాదవ్ కి 2018లో మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ కోర్టు తలుపు తట్టింది సీబీఐ. విచారణ అధికారుల్ని తేజస్వీ యాదవ్ బెదిరిస్తున్నారంటూ ఆరోపించింది సీబీఐ. దీని వెనక కేంద్రం కుట్రకోణం ఉందని అంటున్నారు ఆర్జేడీ నేతలు.

ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన తేజస్వీ యాదవ్ ఎప్పుడూ బీజేపీ అధికారంలో ఉండదని, ఆ విషయాన్ని సీబీఐ అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సీబీఐ అధికారులు కూడా ఎల్లప్పుడూ పదవుల్లో ఉండరనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. దర్యాప్తు సంస్థలు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలన్నారాయన. బీజేపీకి కొమ్ముకాయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను సీబీఐ తప్పుబడుతోంది. తేజస్వీ యాదవ్ దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు తేజస్వీ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌ పై సమాధానమివ్వాలని సూచించింది.

2006లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టుల కుంభకోణం జరిగిందనే ఆరోపణలున్నాయి. రాంచీ, పూరి ప్రాంతాల్లో హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ లు పొందిన సంస్థలు.. పాట్నాలో మూడు ఎకరాల విలువైన స్థలాన్ని లాలూ కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చారని ఫిర్యాదులున్నాయి. ఈ వ్యవహారంపై దృష్టిసారించిన సీబీఐ, ఈడీ.. కేసులు నమోదు చేశాయి. రెండు కంపెనీలు, 12మంది వ్యక్తులపై కేసులు పెట్టారు. ఈ కేసులో లాలూ భార్య రబ్రీదేవి, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ 2018లో బెయిల్ పొందారు. బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణలో సీబీఐ మళ్లీ స్పీడ్ పెంచింది. ఆర్జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. జేడీయూతో చేతులు కలిపిన ఆర్జేడీపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్రం ఇలా సీబీఐని రంగంలోకి దింపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ ఢిల్లీ కోర్టు మెట్లెక్కడం కీలక మలుపు.

Tags:    
Advertisement

Similar News