గుజరాత్‌లో ఫిరాయింపుదార్లకు బీజేపీ, ఆప్ టిక్కెట్లు
బీజేపీ, ఆప్ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో స్పష్టత వుంది. నిజాయితీ కనిపిస్తుంది. పాలక బీజేపీ ప్రలోభాలని, అవాంతరాల్ని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు కేటాయించినట్టు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీష్ థకర్ అన్నారు.
రెండు దశాబ్దాల పైబడి గుజరాత్‌లో అధికారపార్టీగా ఉన్న బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇవ్వడం ఆ పార్టీ బలహీనతని చెప్పకనే చెప్పినట్టయింది. ఇక బీజేపీకి తామే సిసలైన ప్రత్యామ్నాయమంటూ ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సైతం ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన వారికి ఆప్ టికెట్లు ఇచ్చింది. దీనితో ఆప్ చెబుతున్న పారదర్శక, ప్రత్యామ్నాయ రాజకీయాలనే మాటలకు అర్థమేముందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటివరకు గుజరాత్ బీజేపీ 166 మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించింది. ఈ జాబితాలో - కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలో 9 మంది పేర్లు ఉన్నాయి. వీరంతా 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినవారే. వారిని రకరకాల ప్రలోభాలతో బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. వారందరికీ ఇప్పుడు టికెట్లు కేటాయించింది. ఇక గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన హార్దిక్ పటేల్‌కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది.
పారదర్శక రాజకీయాల గురించి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంపైన మాటలెన్నో చెబుతారు. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇతర పార్టీల మాదిరిగానే సంప్రదాయ రాజకీయాలే చేస్తారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)ల నుంచి ఆప్‌లో చేరిన వారందరికీ టికెట్లు ఇవ్వడమే ఇందుకు దాఖలా. ఆప్ ప్రకటించిన 174 మంది అభ్యర్థుల జాబితాలో ఇతర పార్టీల వారే అధికం. తమ పార్టీలో చేరిన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాస్ గాధ్వికి, బీజేపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కేసరిసింగ్ వాఘేలాకు, బీటీపీ నర్మద జిల్లా అధ్యక్షుడు చైతర్ వాసవకు ఆప్ టికెట్లు ఇచ్చింది. వివిధ జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయించేందుకు ఆప్ ప్రాధాన్యమిచ్చింది. దీనితో ఆప్ చెబుతున్న 'ప్రత్నామ్నాయం' మాటని జనం ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. అంతేగాక ఈ సీట్ల కేటాయింపు పర్వం గుజరాత్‌లో ఆ పార్టీకి తగిన నిర్మాణం, పునాది లేవనే అంశాన్ని తెలియజేస్తుంది.
బీజేపీ, ఆప్ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో స్పష్టత వుంది. నిజాయితీ కనిపిస్తుంది. పాలక బీజేపీ ప్రలోభాలని, అవాంతరాల్ని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు కేటాయించినట్టు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీష్ థకర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎంత పెద్ద నాయకుడి కోసమైనా తమ కార్యకర్తలను పక్కన పెట్టబోమని చెప్పారు. ఇప్పటివరకు ప్రకటించిన 89 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇందుకు అనువుగానే ఉంది. సమీప గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారెవరూ లేకపోవడం ఈ జాబితాలో లేరు.
కాంగ్రెస్‌ని వీడి ఇతర పార్టీల్లో చేరినవారు ఎవరూ గెలుపొందడానికి వీల్లేకుండా తమ పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నదని జగదీష్ థకర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపికపై మీడియాలో ప్రచారం కనిపించడం లేదు గానీ స్థానికంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యూహాత్మకంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదార్లను నమ్ముకొని టికెట్లు కేటాయిస్తున్న బీజేపీ, ఆప్‌లకు ప్రజల మద్దతు ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది.