బిల్కిస్ బానో కేసుపై ఆప్ మౌనం హిందుత్వ ఓట్ల కోస‌మేనా..?

ఆప్ అధినేత కేజ్రీవాల్ హిందుత్వ ఓట్ల కోసం బీజేపీ మార్గంలో నడుస్తున్నారా ? గుజరాత్ లో 11 మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వం పై విపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తూ ఉంటే కేజ్రీవాల్ మౌనంగా ఉండటానికి కారణమేంటి ?

Advertisement
Update:2022-08-23 17:15 IST

బిల్కిస్ బానో కేసులో యావ‌జ్జీవ శిక్ష పొందిన 11 మంది దోషులు ముందుగానే జైలు నుంచి విడుద‌లైన‌ప్ప‌టినుంచి దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విప‌క్షాలు, మేధావులు, న్యాయ‌నిపుణులు అంతా న‌రేంద్ర మోడీని, బిజెపి నేతృత్వంలోని గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా వారు జైలు నుంచి విడుద‌లైన‌ప్ప‌న‌ప్పుడు స్వీట్లు పంచ‌డం, వారిని పూల‌దండ‌ల‌తో స్వాగ‌తించ‌డంపై మ‌రింత‌ ఆగ్ర‌హం, నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బిజెపియేత‌ర రాజ‌కీయ ప‌క్షాల‌న్నీఈ విష‌యమై విమ‌ర్శిస్తుంటే 'ఆప్' అధినేత కేజ్రీవాల్ . ఆయ‌న బృందం మౌనంగా ఉండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ఇప్ప‌టికే ఆప్ తన ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీలో బిజెపితో హోరాహోరీ పోరులో నిమగ్నమై ఉంది . అందుకే ఈ దోషుల విడుద‌ల అంశంపై ఇత‌ర విప‌క్ష పార్టీలతో క‌లిసిరావ‌డం లేదు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆప్ ఈ అంశానికి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆప్ మౌనానికి గల కారణాలు పెద్ద‌గా వెతకన‌క్క‌ర్లేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌ర్చింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల‌పై కేజ్రీవాల్ దృష్టి సారించారు. ఇందుకోస‌మే బానో కేసు విష‌యంలో వ్యాఖ్య‌లు చేస్తే త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌ని ఆయ‌న మౌనంగా ఉంటున్నారా అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ ఇప్పటికే గుజరాత్‌లో పట్టు సాధించింది. పంజాబ్‌కు సరిహద్దుగా ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పాగా వేయాల‌ని ఆశిస్తోంది. కేజ్రీవాల్ రెండు రాష్ట్రాలలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ముఖ్యంగా మోడీ రాజ్యమైన గుజరాత్‌పై దృష్టి పెట్టారు.

300 యూనిట్ల ఉచిత విద్యుత్, గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు రూ. 1,000 అనే నాలుగు హామీలపైనే ఆయన ప్రచారం సాగుతున్నప్పటికీ, మెజారిటీ హిందూ సమాజాన్ని దూరం చేసుకోవ‌డం కేజ్రీవాల్‌కు ఇష్టం లేదని స్పష్టమవుతోంది. బిల్కిస్ బానో అంశంపై చర్చతో గుజరాత్ వంటి మతపరంగా సున్నితమైన‌ రాష్ట్రంలో తనకు రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉండొచ్చ‌ని ఆయ‌న భావిస్తున్నారు.

రాష్ట్రాల‌న్నింటిలో త‌మ పాల‌నే రావాల‌న్న‌ట్టు బిజెపి ఎలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌దో ఆప్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది. పైగా ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ ప్రధాని పీఠం పై క‌న్నేశార‌ని, మోడీని ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

హిందూత్వ వైఖ‌రితో ముందుకు..

కేజ్రీవాల్ రాజకీయ లబ్ధి కోసం మతాన్ని ఉపయోగించడంలో బిజెపి కి పోటీగానా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేవాలయాలకు కేజ్రీవాల్ తో పాటు ఇతర పార్టీ నాయకులు ఎక్కువగా ప్రచారం చేయడం, హిందూ పండుగలను ఘనంగా జరుపుకోవడం తీర్థయాత్రలకు ప్రభుత్వ నిధులను స‌మ‌కూర్చ‌డం వంటి వాటితో హిందూ కార్డును బహిరంగంగా ఉప‌యోగించుకునేందుకు ఆప్ నేత వెన‌కాడ‌లేదు. మతతత్వ కార్డును ఉప‌యోగిస్తున్నార‌నే ఆరోపణలను కూడా ఎదుర్కొంది. అయితే హిందువులపై సానుకూలంగా ఉన్నప్పటికీ మైనారిటీలపై ఎటువంటి వ్య‌తిరేక‌, విద్వేష భావ‌న‌లు లేవ‌ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

హిందువులను ఆకర్షించడంలో బిజెపితో పోటీ పడడమే కాకుండా, ముస్లిం వ‌ర్గాల‌నుంచి కాషాయ పార్టీని దూరం చేయ‌డానికి ఆప్ స్పష్టంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లో రోహింగ్యాల విష‌యంలో కానీ, గ‌త ఏప్రిల్ లో జహంగీర్‌పురిలో మతపరమైన హింస జరిగినప్పుడు కానీ,పేద ముస్లింల ఇళ్లను బుల్‌డోజర్‌లతో ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌ల‌లో ఆప్ ప్ర‌గ‌తిశీల‌నాయ‌కులు కొంద‌రు మాత్ర‌మే బిజెపిపై విమ‌ర్శ‌లు చేశారు.

జాతీయ ప్రత్యామ్నాయమా లేక బిజెపి కి బి-టీమా'?

అయితే, కేజ్రీవాల్ ఈ మార్గంలో వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని ఆప్ ఆమోదించింది. పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆగ్ర‌హంతో ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళ‌న‌లు చేసినప్పుడు కూడా ఆప్ పాల్గొన‌లేదు. అదేవిధంగా, రెండేళ్ళ క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించగా, 200 మంది గాయపడినప్పుడు కూడా ఆప్ నాయకులు కనిపించడం కానీ క‌నీసం ఈ ఘ‌ట‌న‌పై స్పందించ‌డంకానీ జ‌ర‌గ‌లేదు.

అవినీతికి వ్యతిరేకం అంటూ హోరెత్తించిన ప్రచారం క్ర‌మంగా హామీల రూపం సంత‌రించుకుంది. చౌకైన విద్యుత్, మెరుగైన విద్యా మౌలిక సదుపాయాలు, మెరుగైన పౌర సేవలకు ప్రాధాన్యత అంటూ హ‌మీల‌ను ఇస్తోంది. కాంగ్రెస్ బీజేపీల రాజకీయాలకు ఆప్ ఆచరించే రాజకీయాలు భిన్నంగా ఉంటాయని హామీ ఇవ్వడంతో పేదలు, అట్టడుగు వర్గాలు అప్ప‌ట్లో చేరువ‌య్యాయి. కానీ ఇప్పుడు క‌థ మారిన‌ట్టు క‌న‌బ‌డుతోంది.

సైద్ధాంతిక పునాది లేదు..

అన్నా హజారే నేతృత్వంలోని 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి కేజ్రీవాల్ బ‌హిరంగంగా ప్ర‌జా బాహుళ్యంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌నేతృత్వంలో ఏర్ప‌డిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) కి సైద్ధాంతికంగా గ‌ట్టి పునాది ఏదీ లేదు. స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామన్నఏకైక హామీతో అధికారంలోకి వచ్చినా అప్పటి నుంచి అనేక సార్లు ఎప్ప‌టి ప‌రిస్థితుల‌కు అప్ప‌టికి అన్న‌ట్టుగా త‌న వైఖ‌రి మారుస్తూనే ఉంది ఆప్‌.

ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉండ‌డం, త‌న ఖాతాలో రెండు రాష్ట్రాలు ఉండ‌డంతో ఆప్ అధినేత కేజ్రీ వాల్ ఆలోచ‌న‌లు జాతీయ రాజ‌కీయాల వైపు మ‌ళ్ళాయి. ప్రధాని మోడీతో ఢీ కొనాల‌ని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకే బిజెపి ప్ర‌వ‌చించే సుప‌రిపాల‌న సందేశాన్ని ఆయ‌న అందిపుచ్చుకుని దానినే వినిపిస్తున్నారు. అలాగే హిందూ అనుకూల వైక‌రిని అనుస‌రిస్తున్నారు. అందుక‌నే దేశ‌వ్యాప్తంగా ఎంతో సంచ‌ల‌నం రేపుతున్న బిల్కిస్ బానో కేసులోదోషులు ముందుగా విడుద‌ల అంశంపై ఆప్ మౌనంగా ఉంటోంది. ఈ వైఖ‌రి ఆప్ కు రాజ‌కీయంగా ఎన్నిక‌ల్లో లాభిస్తుందా లేదా బిజెపికి బి-టీమ్ అనే అప‌ప్ర‌థ మూట‌గ‌ట్టుకుందో కాల‌మే నిర్ణ‌యించాలి. 

Tags:    
Advertisement

Similar News