కల్తీ మద్యం ఘటన.. 20కి చేరిన మృతులు
సివాన్‌లో ఇప్పటిదాకా 20 మంది మరణించినట్లు ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడి
బీహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలయ్యారు. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6 ఉండగా.. గురువారం ఈ సంఖ్య 20కి చేరింది. పలువురు బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సివాన్‌లో ఇప్పటిదాకా 20 మంది మరణించినట్లు ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడించారు. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంచాయతీ బీట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
అక్టోబర్ 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. బీహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించారు. అయినా అక్కడ అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కల్తీ మద్యం కారణంగా కొన్నేళ్లుగా వందలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.