శరద్ పవార్‌కు భారీ షాక్.. - అజిత్‌కు ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు
ఈనెల ప్రారంభంలో అజిత్ పవార్, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఈశాన్య రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏడుగురు.. అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు గురువారం వారొక ప్రకటన విడుదల చేశారు. నాగాలాండ్ ఎన్సీపీ కార్యాలయ పరిధిలోని పార్టీ కార్యకర్తలందరూ కూడా అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తారని వారు పేర్కొన్నారు.
ఈనెల ప్రారంభంలో అజిత్ పవార్, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరారు. ఆ చర్య శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీని చీల్చింది.
తిరుగుబాటు అనంతరం కూడా అజిత్ పవార్.. శరద్ పవార్‌తో రెండుసార్లు భేటీ అయ్యారు. తన వర్గం నేతలతో కలిసి ముంబైలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్ మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదని రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు.