జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్
కొత్త సిలబస్‌లో సీబీఎస్ఈ అంశాలనే ఎక్కువగా చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులభతరం కానుంది. దీని వల్ల ఇంటర్ చదివే విద్యార్థులు గతం కంటే ఎక్కువ సిలబస్‌ను అనుసరించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు ఇది బిగ్ అలర్ట్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష ఇకపై కొత్త సిలబస్‌తో నిర్వహించనున్నారు. 2023లో రాసే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌తోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ యాక్షన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులలోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ ప్రకారమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్‌తో అనుసంధానంగా ఉండేలా...
నూతన సిలబస్‌ను జేఈఈ మెయిన్‌తో అనుసంధానం ఉండేలా రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కొత్త సిలబస్‌లో.. పాత సిలబస్‌లోని కొన్ని చాప్టర్లను తొలగించి.. కొత్తగా కొన్ని చాప్టర్లను చేర్చారు. కొత్త సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in పొందుపరిచారు.
కొత్త సిలబస్‌లో ప్రధాన మార్పులు ఇలా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో గణితంలో కొత్తగా స్టాటిస్టిక్స్ చేర్చారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీ కండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి జేఈఈ మెయిన్‌లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్‌లోని ఫోర్స్‌డ్ డాంపడ్ అసిల్లేషన్స్, ఈఎం వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. కెమిస్ట్రీలోనూ పలు మార్పులు చేశారు.
కొత్త సిలబస్‌లో సీబీఎస్ఈ అంశాలే ఎక్కువ...
కొత్త సిలబస్‌లో సీబీఎస్ఈ అంశాలనే ఎక్కువగా చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులభతరం కానుంది. దీని వల్ల ఇంటర్ చదివే విద్యార్థులు గతం కంటే ఎక్కువ సిలబస్‌ను అనుసరించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెయిన్‌కి అనుసంధానంగా కొత్త సిలబస్‌ను చేర్చినందువల్ల మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సిలబస్‌ను పెంచినప్పటికీ పరీక్ష సులువుగా ఉండే అవకాశముందని వారు భావిస్తున్నారు. మెయిన్‌లోని అంశాలనే అడ్వాన్స్‌డ్‌లో చేర్చినందున పైకి సిలబస్ పెరిగినట్టు కనిపించినా.. అవే అంశాలు కనుక విద్యార్థులపై అంతగా ఒత్తిడి ఉండదని చెబుతున్నారు. ఐఐటీల్లో సీట్లు ఆశిస్తున్నవారు కొత్త ఫార్మాట్ ప్రకారం సిద్ధం కావాలని సూచిస్తున్నారు.