విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు.. రాహుల్‌పై ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ స్పందించారు. విదేశీ స్త్రీకి పుట్టిన రాహుల్ గాంధీకి దేశభక్తి లేదని, ఎప్పటికీ రాదని మరోసారి నిరూపించారని విమర్శించారు.

Advertisement
Update:2023-03-12 09:21 IST

చాణక్యుడు చెప్పినట్లు విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని, దీనిని రాహుల్ గాంధీ మరోసారి నిరూపించాడని భోపాల్ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల లండన్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి క్రేమ్ బ్రిడ్జ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యంపై, మీడియాపై అణచివేత కొనసాగుతోందని, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు దాడులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు చేశారు. ఇటువంటి విషయాలపై విపక్షాలు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ స్పందించారు. విదేశీ స్త్రీకి పుట్టిన రాహుల్ గాంధీకి దేశభక్తి లేదని, ఎప్పటికీ రాదని మరోసారి నిరూపించారని విమర్శించారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిన వారు కావడంతో, వారు భారతదేశానికి చెందినవారు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరించడం లేదని, అందువల్లే కొందరు మాట్లాడే సమయంలో మైక్ క‌ట్ చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు.

పార్లమెంటు సజావుగా జరిగితే ఎక్కువ పనులు జరుగుతాయని, అలా జరిగితే కాంగ్రెస్ మనుగడ సాధించలేదనే భయం ఆ పార్టీలో ఉందన్నారు. దేశ ప్రజలతో ఎన్నుకోబడ్డ రాహుల్ గాంధీ విదేశాల్లో కూర్చుని పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారని, ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని ప్రజ్ఞాఠాకూర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదని, దేశం నుంచి తరిమేయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News