స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వేళ... ఢిల్లీకి బయలు దేరిన దళితయాత్రపై పోలీసులు దాష్టీకం!
గుజరాత్, రాజస్తాన్, హర్యానాకు చెందిన దళితులు, అంటరాని తనాన్ని వ్యతిరేకించాలి, అస్ప్రుశ్యత భావాలను తొలగించుకోవాలన్న నినాదాన్ని భుజానకెత్తుకొని ఢిల్లీ వరకు 'భీమ్ రుడాన్' పేరిట యాత్ర చేపట్టారు. అయితే కేంద్ర హోం మత్రిత్వ శాఖ ఆదేశాలతో పోలీసులు ఈ యాత్రను హర్యాణాలో ఆపేశారు.
భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి దళితులపై పోలీసులు దాష్టీకం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 200 మంది మహిళలతో సహా దాదాపు 350 మంది దళితులను చుట్టుముట్టి వారిని ముందుకు కదనలనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాజస్థాన్-హర్యానా సరిహద్దు వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. విచిత్రమేంటంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే ఈ దారుణం జరగడం ఆందోళనకరం. ఇంతకీ వారెవరు..ఎక్కడికి వెళుతున్నారు..వారిని ఎందుకు అడ్డుకున్నారు.. అనే విషయాలు తెలిస్తే మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
వీరంతా గుజరాత్, రాజస్తాన్, హర్యానా పరిసర ప్రాంతాలకు చెందిన దళిత వర్గ ప్రజలు. మహాత్మాగాంధీ బోధించిన అంటరాని తనాన్ని వ్యతిరేకించాలి, అస్ప్రుశ్యత భావాలను తొలగించుకోవాలన్న నినాదాన్ని భుజానకెత్తుకొని ఢిల్లీ వరకు 'భీమ్ రుడాన్' పేరిట యాత్ర చేపట్టారు"1947 నాటి అస్పృశ్యత రహిత భారతదేశం స్వప్నం 2047లో సాకారమవుతుందా?" అనే స్లోగన్ తో 1,000 కిలోల బరువు, 10 అడుగుల పొడవైన ఇత్తడి నాణేన్ని తీసుకువెళుతున్నారు. 2,047 మిమీ వ్యాసం కలిగిన ఈ నాణెం గుజరాత్ , ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది దళితులు నుంచి సేకరించిన ఇత్తడి పాత్రల విరాళాలతో తయారు చేశారు. భీమ్ రుడాన్ (భీం విలపించడం) యాత్రలో మోసుకెళ్ళే ఈ నాణెం మీద ఒక వైపు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, మరో వైపు గౌతమ బుద్ధుడి చిత్రాలు రూపొందించారు.
గుజరాత్ దళిత నాయకుడు మార్టిన్ మాక్వాన్ కు చెందిన నవసర్జన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగుతోంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనంపై ఈ కాయిన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో భారత రాష్ట్రపతికి దీనిని సమర్పించాలని గుజరాత్, రాజస్థాన్ ,హర్యానాకు చెందిన వందలాది మంది దళితులు భావించారు. అందుకే తామంతా ఢిల్లీ బయలుదేరి యాత్రగా వెలుతున్నామని మార్టిన్ చెప్పారు.
మాక్వాన్ మాట్లాడుతూ, "మా ప్రయాణం ముందుకు సాగకుండా చేసేందుకు 300 మందికి పైగా పోలీసులు మాపై నిఘా ఉంచారు. మేము హర్యానా సరిహద్దు వద్ద పోలీసు అధికారులను కలిశాము, వారు మమ్మల్ని ఢిల్లీకి వెళ్లనివ్వవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ ఎ) నుండి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆదివారం సాయంత్రం పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని అల్వార్ దాటిన వెంటనే హర్యానాలోని రేవారీ సరిహద్దు వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని" ఆయన చెప్పారు.
"డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జ్ఞాపకార్థం, దేశం నుండి అంటరానితనం నిర్మూలన జరగాలని ఆయన కలలు సాకారం కావాలని కోరుతూ ఈ యాత్రను చేపట్టామని మార్టిన్ అన్నారు. మార్టిన్ మాక్వాన్ కు చెందిన నవసర్జన్ సంస్థ దశాబ్దాలుగా దళితుల హక్కుల కోసం పోరాడుతోంది. "స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ అంబేద్కర్ కల నెరవేరకపోవడం ప్రభుత్వాల సమష్టి వైఫల్యం, అంటరానితనం లేని భారతదేశాన్ని చూడాలనేది మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కల"అని ఆయన అన్నారు.
"దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన భారత రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, భారత ఉపరాష్ట్రపతికి మేము దీని గురించి ఒక లేఖను సమర్పించాలనుకున్నాము" అని ఆయన చెప్పారు. ఈ సమస్యను హైలైట్ చేయడానికి దేశంలోని ఎంపీలు, ముఖ్యమంత్రులందరికీ 3 కిలోల చిన్న నాణేలను పంపిణీ చేయాలనుకుంటున్నట్టు మక్వాన్ తెలిపారు. అయితే తమను ముందుకు కదలనీయకపోవడంతో తమకు గుజరాత్‌కు తిరిగి పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆగస్టు 1న ఆరు బస్సులు, మూడు ట్రక్కులు, ఒక లారీలో భారీ ఇత్తడి నాణేన్ని తీసుకుని బయలుదేరాం." అని మాక్వాన్ విలపిస్తూ చెప్పారు.
సినిమా కూడా విడుదల చేస్తాం..
"మా డిమాండ్ ను, న్యాయమైన ఆకాంక్షను శాంతియుతంగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. కారణం ఏదైనా కావచ్చు..కానీ ప్రబుత్వం మమ్మల్ని అడ్డుకుంటోంది. ముందుకు కదలనీయడం లేదు." అని అన్నాడు.
ఒక్కొక్క రూపాయి ని సేకరించామని, రూ.6.5 లక్షలను విరాళాల రూపంలో గుజరాత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న దళితుల నుండి సేకరించి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. భారీ నాణెం తయారు చేసేందుకు గ్రామస్తులు తీసుకొచ్చిన 2,450 కిలోల పాత్రలను కరిగించి అహ్మదాబాద్‌లో విశ్వ రంజన్, బల్లు అనే హస్తకళాకారులు ఈ భారీ ఇత్తడి నాణేన్ని తయారు చేశారు. ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. ఇంక పాత్ర విరాళాలను ఆపేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ నాణెంపై మేం ఒక సినిమా కూడా రూపొందించాం. వచ్చే ఏడాది దీనిని విడుదల చేస్తాం అని మార్టిన్ మాక్వాన్ చెప్పారు.