భీమ్‌ ఆర్మీ చీఫ్‌పై తూటాల వర్షం

ఆజాద్‌పై కాల్పుల విషయం తెలియడంతో భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఆకస్మిక దాడి జరుగుతుందని తాను ఊహించలేదన్నారు చంద్రశేఖర్‌ ఆజాద్‌.

Advertisement
Update:2023-06-29 10:45 IST

భీమ్ ఆర్మీ చీఫ్‌, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ రావణ్‌పై తూటాల వర్షం కురిసింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌పై కొందరు కాల్పులు జరిపారు. సహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ దాడి జరిగింది. కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సహరాన్‌పూర్ ఆస్ప‌త్రికి తరలించి వైద్యం అందించారు. కాగా.. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఆజాద్‌పై కాల్పుల విషయం తెలియడంతో భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఆకస్మిక దాడి జరుగుతుందని తాను ఊహించలేదన్నారు చంద్రశేఖర్‌ ఆజాద్‌. ప్రజల ప్రేమ, ఆశీర్వాదంతోనే తాను కోలుకుంటానన్నారు. ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని కోరారు.

దళిత రాజకీయాల్లో కొత్త వెల్లువలా దూసుకొచ్చిన పేరు చంద్రశేఖర్‌ ఆజాద్‌. ఆత్మగౌరవం కోసం ఆర్మీ ఉండాల్సిందే అని ప్రకటించాడు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, కుల అణచివేతకు వ్యతిరేకంగా 2015లో భీమ్ ఆర్మీని స్థాపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లా దడ్‌ఖౌలీ గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ రావణ్ `లా` పూర్తి చేశారు. 2015లో తమ గ్రామంలో 'గ్రేట్‌ చమర్స్‌ ఆఫ్‌ దడ్‌ఖౌలీ వెల్‌కమ్స్‌ యూ' అనే సైన్‌బోర్డును ఏర్పాటు చేసి సంచలనానికి కేంద్రమయ్యాడు. అది దళితులు, ఠాకూర్‌లకు మధ్య వివాదానికి, ఘర్షణకు దారితీసింది. దీంతో అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే సంఘటిత శక్తి అవసరమంటూ.. భీమ్‌ ఆర్మీని ప్రారంభించారు. వేలాది మంది దళిత యువకులను ఒక్కటి చేశారు. విద్యతోనే దళితుల సాధికారత సాధ్యమని ప్రకటించిన భీమ్‌ ఆర్మీ ఆ దిశలో దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనేక కేసులను ఎదుర్కొన్నారు.

2017లో యూపీ సహరన్‌పూర్‌ జిల్లాలో మహారాణ ప్రతాప్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో హింస చెలరేగింది. షబ్బీర్‌పూర్‌, రాంపూర్‌ గ్రామాల్లో ఠాకూర్ కమ్యూనిటీ చేపట్టిన శోభాయాత్ర దళిత వాడల్లోకి ప్రవేశించడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దళితవాడలో 60 ఇళ్ల దహనానికి కారణమైంది. ఈ చర్యను నిరసిస్తూ భీమ్‌ ఆర్మీ చేపట్టిన నిరసన కార్యక్రమాలపై పోలీసులు లాఠీచార్జ్‌ జరిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ హింసకు భీమ్‌ ఆర్మీయే కారణమంటూ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కేసు నమోదు చేశారు. ఫలితంగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

చంద్రశేఖర్‌ ఆజాద్‌ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై దాడిని ఖండించారు. రాజ్యాంగ ప్రతిని చేతబూని మీసం మెలేసి ఢిల్లీ నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. దళితుల హక్కుల కోసం భీమ్‌ ఆర్మీ చేపడుతున్న కార్యక్రమాలను అగ్రకులాలు, హిందుత్వ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయనే వాదన ఉంది. చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పుల వెనక రాజకీయ కోణం ఉన్నట్లు భీమ్‌ ఆర్మీ సభ్యులు అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News