బీజేపీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సులు

రాజస్థాన్‌లోని ఝలావర్‌లో తన భారత్ జోడో యాత్ర సాగుతున్న క్రమంలో ఆ యాత్ర ఓ బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో ఆ కార్యాలయం బిల్డింగ్ మీద కొంత మంది బిజెపి కార్య‌కర్తలు తమ పార్టీ జెండాలతో నిలబడి జోడో యాత్రను చూస్తున్నారు.

Advertisement
Update:2022-12-06 15:36 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ప్రతీ రోజూ బీజెపి, ఆరెస్సెస్ లపై విరుచుక పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఓ వింత సంఘటన జరిగింది.

రాజస్థాన్‌లోని ఝలావర్‌లో తన భారత్ జోడో యాత్ర సాగుతున్న క్రమంలో ఆ యాత్ర ఓ బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో ఆ కార్యాలయం బిల్డింగ్ మీద కొంత మంది బిజెపి కార్య‌కర్తలు తమ పార్టీ జెండాలతో నిలబడి జోడో యాత్రను చూస్తున్నారు. వెంటనే రాహుల్ గాంధీ వాళ్ళ వైపు చేతులు ఊపడమే కాకుండా ఫ్లయింగ్ కిస్ లను విసిరాడు. అతను తన పరివారంలోని ఇతరులను కూడా అలాగే చేయమని కోరాడు.అతనితో పాటు నడుస్తున్న సచిన్ పైలట్, మంత్రి రామ్ లాల్ జాట్ కూడా బీజేపీ కార్యకర్తల వైపు చేతులు ఊపారు.

అంతకు ముందు రోజే రాహుల్ గాంధీ బీజేపీ , ఆరెస్సెస్ లపై విరుచుకపడ్డారు. వారు "జై శ్రీ రామ్"కి బదులుగా "జై సియా రామ్" , "హే రామ్" అని ఎందుకు నినాదాలు చేయరని ప్రశ్నించారు. వారు స్త్రీ ద్వేషులని రాహుల్ ఆరోపించారు.

రాహుల్ ఈ రోజు పర్యటించిన నియోజకవర్గం ఝలావర్ బీజేపీకి కంచుకోట. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంత గడ్డ. అక్కడున్న బీజేపీ కార్యాలయం వ‌సుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ ది. ఆ భవనాన్ని లైట్లు, బీజేపీ జెండాలతో అలంకరించారు. దాని వెలుపలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వసుంధర రాజే, దుష్యంత్ సింగ్‌లతో కూడిన భారీ కటౌట్లు ఉంచారు.

కాగా రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్ లు ఇవ్వడం పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు...

"ఇది రాహుల్ గాంధీ శైలి, మీరు దీన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు. వివిధ రాజకీయ భావజాలం ఉన్న‌ప్రజలను ఆయన స్వాగతించారు" అని అన్నారు. గతంలో రాహుల్ RSS కార్యకర్తల‌ను కూడా ఆహ్వానించిన విషయం ఎత్తి చూపారు.

రాహుల్ గాంధీ తర్వాత ఫేస్‌బుక్‌లో , "ఎవరిపైనా ద్వేషం, కోపం, పగ లేదు. ఇవేవీ 'భారత జోడో యాత్ర' యాత్రికుల హృదయాల్లో లేవు. వారికి ఉన్నది భారతదేశాన్ని ఏకం చేయాలనే కోరిక, భారతీయుల బాధల పట్ల కరుణ, పౌరులందరిపై ప్రేమ. " అని రాశారు. తన పాదయాత్రలో ఎవరైనా పాల్గొనడానికి స్వేచ్ఛ ఉందని కూడా ఆయన అన్నారు.


Tags:    
Advertisement

Similar News