రెండు చుక్కల టీకాకు కేంద్రం ఓకే.. - కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో నిర్ణయం
ఈ చుక్కల మందు టీకా `ఇన్‌కొవాక్`కు బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజాగా దానికి కేంద్రం అనుమతి లభించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మన దేశంలో రెండు చుక్కల టీకాకు ఆమోదం తెలిపింది. దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచే ఈ టీకా దేశంలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఇది లభించనుంది. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
నవంబర్‌లోనే అత్యవసర అనుమతి..
ఈ చుక్కల మందు టీకా `ఇన్‌కొవాక్`కు బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజాగా దానికి కేంద్రం అనుమతి లభించింది. 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
పండుగ సీజన్ కోసం కొత్త మార్గదర్శకాలు..
రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని కేంద్రం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఈ పండుగ సీజన్‌లో అందరూ కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరని పేర్కొంది. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్స్ కూడా నిర్వహించాలని ఆదేశించింది.