అమెజాన్‌పై నాలుగేళ్లు పోరాడి కేసు గెలిచిన బేకరీ

హ్యాపీ బెల్లీ బేక్స్, హ్యాపీ బెల్లీ అనేవి రెండు ఒకేలా ఉన్నాయి. ఇకపై అమెజాన్ ఇలా అర్థం వచ్చే ఏ పేరును వాడి వ్యాపారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. క్లౌడ్ టెయిల్, టూట్సీ సంస్థలు పర్మనెంట్‌గా ఈ పేరును ఉపయోగించకుండా నిషేధం విధించింది.

Advertisement
Update:2022-09-23 19:42 IST

బెంగుళూరులోని ఓ చిన్న బేకరీ.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై నాలుగేళ్లు పోరాడి ఓ కేసు గెలిచింది. మహిళలే నిర్వహిస్తున్న ఈ బేకరీ పేరును అనుమతి లేకుండా అమెజాన్ వాడుకున్నదనే కేసులో కోర్టు బేకరీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ విచారణలో అమెజాన్ కేసు గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా న్యాయం ఓ చిన్న బేకరీ పక్షానే నిలవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో 2008 నుంచి 'హ్యాపీ బెల్లీ బేక్స్' అనే బేకరీని శీషమ్ హిందూజా అనే మహిళ నిర్వహిస్తోంది. తన బేకరికీ 'హ్యాపీ బెల్లీ' అనే ట్రేడ్ మార్క్‌ను 2016లో రిజిస్టర్ చేయించారు. 30 మంది ఎంప్లాయిస్‌తో శీషమ్ ఈ బేకరీలో కుకీస్, కేక్స్, ఇతర బేక్డ్ ఐటెమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. బెంగళూరులో ఈ బేకరీ చాలా పాపులర్ అయ్యింది. వాస్తవానికి 2008లో ఈ బేకరీని స్థాపించినప్పుడు 'రీగాలర్' అనే పేరు పెట్టారు. కానీ 2010లో 'హ్యాపీ బెల్లీ' అని పేరు మార్చి 2016లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించారు.

2017 క్రిస్మస్ సమయంలో శీషమ్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. హ్యాపీ బెల్లీ ప్రొడక్ట్స్ అమెజాన్‌లో అమ్ముతున్నారా అని ఆ కాల్స్‌లో పలువురు ఎంక్వైరీ చేశారు. అయితే తాము ఏ ఈ-కామర్స్ సంస్థలోనూ రిజిస్టర్ కాలేదని చెప్పారు. అమెజాన్ వెబ్‌సైట్‌ను పరిశీలించగా 'హ్యాపీ బెల్లీ' పేరుతో బేకరీ ఐటెమ్స్ అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన ఆహార పదార్థాలు, బేవరేజెస్ అందుబాటు ధరల్లో అందిస్తున్నామని అమెజాన్ పేర్కొంది. తమ బేకరీ పేరుతోనే అమెజాన్ వ్యాపారం చేస్తోందని గుర్తించిన శీషమ్ వెంటనే కేసు వేసింది. అమెజాన్ సెల్లర్ సర్వీస్, క్లౌడ్ టెయిల్ ఇండియా, టూట్సీ ఎల్ఎల్‌సీలు ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. అమెజాన్ కోసం టూట్సీ సంస్థ ట్రేడ్ మార్క్ కోసం ప్రయత్నించి విఫలమైందని కూడా తెలిపింది.

కాగా, కేసు విచారణ సమయంలో అమెజాన్ ఆ బ్రాండ్ నేమ్ తమదేనని వాదించింది. 'హ్యాపీ బెల్లీ బేక్స్'కి తమ బ్రాండ్ 'హ్యాపీ బెల్లీ'కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది. పైగా తాము ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నామని, సదరు బేకరీ మాత్రం బెంగళూరుకే పరిమితం అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత బేకరీకి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో అమెజాన్ నిబంధనలను పూర్తిగా విస్మరించిందని పేర్కొంది. విచారణ సమయంలో 'హ్యాపీ బెల్లీ బేక్స్' ప్రొడక్ట్స్ నాణ్యంగా ఉండవని, వాళ్లు కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోయారని అమెజాన్ వాదించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విధంగా వాదించడం అంటే కంపెనీ అహంకారానికి గుర్తని పేర్కొంది.

హ్యాపీ బెల్లీ బేక్స్, హ్యాపీ బెల్లీ అనేవి రెండు ఒకేలా ఉన్నాయి. ఇకపై అమెజాన్ ఇలా అర్థం వచ్చే ఏ పేరును వాడి వ్యాపారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. క్లౌడ్ టెయిల్, టూట్సీ సంస్థలు పర్మనెంట్‌గా ఈ పేరును ఉపయోగించకుండా నిషేధం విధించింది. బెంగళూరులోనే కాకుండా ఇండియాలో ఈ బ్రాండ్‌ను అమెజాన్ యూజ్ చేయవద్దని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై హ్యాపీ బెల్లీ బేక్స్ ఓనర్ శీషమ్ హిందూజా హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News