బెంగాల్ బీజేపీ సచివాలయం ముట్టడి హింసాయుతం... పోలీసు కారుకు నిప్పు
కోల్ కతా లో బీజేపీ నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బీజేపీ కార్యకర్తలు పోలీసు కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
పశ్చిమ బెంగాల్ లో బిజెపి తలపెట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాయుతంగా మారింది. కోల్‌కతాలో బీజేపీ జరిపిన నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు పోలీసు కారుకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. వారు రెచ్చిపోవడంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కి పాల్పడుతోందని ఆరోపిస్తూ చేపట్టిన భారీ నిరసనలో భాగంగా కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయం ముట్టడికి బిజెపి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నిరసనకారులు పెద్ద ఎత్తున గుమికూడా ఆందోళనకు దిగారు. కార్యకర్తలను పోలీసులు తీసుకెళ్తుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "పశ్చిమ బెంగాల్‌ను ఉత్తర కొరియాగా మార్చారు" అంటూ విపక్ష నాయకుడు సువేందు అధికారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారితో సహా పలువురు బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి మమతకు ప్రజల మద్దతు లేదని, అందుకే బెంగాల్‌లో ఉత్తర కొరియా తరహాలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని అప్పుడు పోలీసులే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సువేందు అధికారి, బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హా సహా ఇతర పార్టీ నేతలను సెక్రటేరియట్ సమీపంలోని రెండో హుగ్లీ వంతెన వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. హౌరా బ్రిడ్జి దగ్గర ఆందోళనకారులు భద్రతా అధికారులతో ఘర్షణకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. బీజేపీ కార్యకర్తలు పోలీసు కారుకు నిప్పు పెట్టారు. ఘర్షణల నేపథ్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాణిగంజ్ ప్రాంతంలోనూ పలువురు బిజెపి కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
సువేందు అధికారి సంత్రాగచ్చి ప్రాంతం నుండి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉత్తర కోల్‌కతా నుండి నిరసనకు నాయకత్వం వహించారు. 'నబన్న అభిజన్'లో పాల్గొనేందుకు కార్యకర్తలు, మద్దతుదార్లను బిజెపి ఏడు రైళ్లలో తరలించింది. ఉత్తర బెంగాల్ నుండి మూడు దక్షిణప్రాంతం నుండి నాలుగు రైళ్ళను ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న తమ నిరసన కార్యక్రమాన్ని మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాద్యత వహించాల్సి ఉంటుందని దిలీస్ ఘోష్ హెచ్చరించారు.