నకిలీ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా బీసీఏఎస్!
ఇంతకీ బీసీఏఎస్ సిద్ధం చేసిన ప్రతిపాదన ఏమిటంటే.. నకిలీ కాల్స్ కేసుల్లో దోషులుగా తేలినవారికి ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించడం.
విమానాశ్రయాలు, విమానాల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపు కాల్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల విమానయాన సంస్థలతో పాటు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల ప్రయాణాలు ఆలస్యమై తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కాల్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) యోచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్టు బీసీఏఎస్ వెల్లడించింది. దానిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముందు ఉంచనున్నట్టు తెలిపింది.
ఇంతకీ బీసీఏఎస్ సిద్ధం చేసిన ప్రతిపాదన ఏమిటంటే.. నకిలీ కాల్స్ కేసుల్లో దోషులుగా తేలినవారికి ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించడం. ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో దోషులకు 3 నుంచి 6 నెలల పాటు నిషేధం మాత్రమే ఉంది. అది కూడా నిందితులు ఏ ఎయిర్‌లైన్స్‌కి బెదిరింపులు చేశారో.. దాని వరకు మాత్రమే వర్తించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీసీఏఎస్ తాను రూపొందించిన తాజా నిబంధనను అన్ని సంస్థల విమానాలకూ వర్తింపజేయాలని భావిస్తోంది.
మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకేరోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపుల కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అంతేకాదు.. వారి ప్రయాణాల్లో కూడా తీవ్ర జాప్యం జరిగింది. ఇక విమానాశ్రయాల్లో కొన్ని గంటల పాటు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. చెన్నై నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానానికి కూడా ఈ తరహా కాల్ వచ్చింది. ఆ తర్వాత అధికారుల దర్యాప్తులో అవన్నీ నకిలీ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బీసీఏఎస్ యోచిస్తోంది.