పంజాబ్ లో సైనిక స్థావరంపై దాడి.. నలుగురు జవాన్లు దుర్మరణం
రెండు రోజుల క్రితం బఠిండాలోని సైనిక స్థావరం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు కనపడకుండా పోయాయి. వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ అదృశ్యమైన రైఫిల్, తూటాలతోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
పంజాబ్ లోని బఠిండా మిలటరీ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. సైనిక శిబిరంలోకి చొరబడి దుండగులు కాల్పులు జరపడం, రెప్పపాటులో వారు అక్కడినుంచి అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆర్మీ అధికారులు ఆ స్థావరం చుట్టూ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తెల్లవారు ఝామున 4.35గంటలకు ఈ ఘటన జరిగింది.
బఠిండా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ 10వ కోర్ కమాండ్ కు చెందిన దళాలు ఉంటాయి. సౌత్-వెస్ట్రన్ కమాండ్ అధీనంలో ఈ స్థావరం ఉంది. ఈ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉంటాయి. అయితే దుండగుల లక్ష్యం ఏంటనేది తేలలేదు. సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్ లో ఆఫీసర్స్ మెస్ లో కాల్పులు జరిగాయి. ఈ మెస్ కి సమీపంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివశిస్తున్నాయి. సాధారణ పౌరుల్లాగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
తుపాకీ, తూటాలు అవేనా..?
రెండు రోజుల క్రితం బఠిండాలోని సైనిక స్థావరం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు కనపడకుండా పోయాయి. వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ అదృశ్యమైన రైఫిల్, తూటాలతోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు బఠిండా మిలట్రీ స్టేషన్ ను మూసివేసి అధికారులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. కాల్పుల ఘటనకు ఉగ్రవాదులు కారణం అయి ఉండే అవకాశాలు తక్కువ అని అంటున్నారు.