తందూరి రోటీ మానేస్తే వాయుకాలుష్యం తగ్గిపోతుందా..?

తందూరీ రోటీలను వండుకోవచ్చు కానీ, ఎలక్ట్రిక్ ఒవెన్‌ లేదా గ్యాస్‌ స్టౌ లపై మాత్రమే వాటిని తయారు చేసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దీంతో హోటళ్లు, దాబాల నిర్వాహకులు షాకయ్యారు.

Advertisement
Update:2023-02-09 14:32 IST

తందూరీ రోటీకి, వాయు కాలుష్యానికి సంబంధం ఏంటి..? పిండితో రోటీ చేస్తే కాలుష్యం పెరిగిపోతుందా..? మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఔననే అంటోంది. వాయుకాలుష్యం పెరగడానికి తందూరీ రోటీ కూడా ఓ కారణం అంటూ తేల్చింది. అందుకే దానిపై నిషేధం విధించింది. మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న తందూరీ రోటీ ప్రియులకు ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఇకపై భోపాల్, ఇండోర్, జబల్‌ పూర్, గ్వాలియర్‌ లో తందూరి రోటీ తయారు చేయకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్ లో తందూరీ రోటీని తయారు చేసేందుకు ప్రత్యేక వస్తువులు వినియోగిస్తారు. చెక్కతో తయారు చేసిన డ్రమ్‌లో బొగ్గుని మండిస్తూ వీటిని కాలుస్తారు. వీటిని కాల్చేందుకు బొగ్గు అధికంగా వినియోగించడం వల్ల పొగ వస్తోందని, దానివల్ల వాతావరణం కలుషితమవుతోందని ప్రభుత్వానికి పలు ఫిర్యాదులందాయి. దీంతో ప్రభుత్వం ఏకంగా రోటీలపై నిషేధం విధించింది.

వండుకోండి.. కానీ..!

తందూరీ రోటీలను వండుకోవచ్చు కానీ, ఎలక్ట్రిక్ ఒవెన్‌ లేదా గ్యాస్‌ స్టౌ లపై మాత్రమే వాటిని తయారు చేసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దీంతో హోటళ్లు, దాబాల నిర్వాహకులు షాకయ్యారు.ఒవెన్, స్టౌలపై రోటీ వేస్తే దాన్ని ఎవరూ ఇష్టపడరని అంటున్నారు. రోటీలను బొగ్గులపై కాల్చితేనే దానికి ఆ రుచి వస్తుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కలప-బొగ్గును కాల్చి తందూరీ రోటీ తయారు చేయడం నిషేధమని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ తో తందూరీ రోటీ ప్రియులు నిరాశకు గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News