పండగ రోజు మాంసం తింటారా..? బెంగళూరు కార్పొరేషన్ వితండ వాదన..

తాజాగా హిందువుల పండగల రోజుల్లో మాంసం విక్రయాలు ఆపేయాలనే వాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం నోటిమాట కాదు, ఏకంగా ప్రభుత్వ సర్క్యులర్ల రూపంలో కూడా ఈ ఆదేశాలు బయటకు రావడం విచిత్రం.

Advertisement
Update:2022-08-29 18:18 IST

ఆహార వ్యవహారాలు, వస్త్రధారణ.. ఇటీవల కాలంలో దేశంలో విపరీతంగా చర్చకు వస్తున్న అంశాలివి. ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ధరించాలి, ఏం ధరించకూడదు.. అనే విషయాలపై ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మెజార్టీ వర్గం అభిప్రాయాలను అందరిపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా హిందువుల పండగల రోజుల్లో మాంసం విక్రయాలు ఆపేయాలనే వాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం నోటిమాట కాదు, ఏకంగా ప్రభుత్వ సర్క్యులర్ల రూపంలో కూడా ఈ ఆదేశాలు బయటకు రావడం విచిత్రం.

బీజేపీ పాలిత కర్నాటకలోని బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ ఇటీవల ఇలాంటి వివాదాస్పద సర్క్యులర్లు జారీ చేస్తూ వార్తల్లోకెక్కింది. ఆ మధ్య కృష్ణాష్టమి సందర్భంగా బెంగళూరు వ్యాప్తంగా మాంసం అమ్మకాలను నిషేధించారు. జంతు వధను కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా దేనికోసం, ఎవరి సంతృప్తికోసం. అంటే ఫలానా పండగ రోజు ఫలానా ఫలహారమే తినాలని ఎవరు ఆదేశిస్తారు, ఎవరు దాన్ని పాటిస్తారు.,? బెంగళూరు కార్పొరేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. తాజాగా మళ్లీ అదే తరహా సర్క్యులర్ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.

వినాయక చవితి పండగ సందర్భంగా బెంగళూరులో మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఆగస్ట్ 31న బెంగళూరు పరిధిలో ఎవరూ జంతువధ చేయకూడదంటూ సర్క్యులర్ జారీ చేశారు. పౌర సరఫరాల సంస్థ కూడా ఈమేరకు ఆదేశాలివ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఈ తరహా ఆంక్షలు లేవు. ఇప్పుడు కొత్తగా ఇదేం పద్ధతి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గణేష్ చతుర్ధి సందర్భంగా మాంసం అమ్మకాలు జరపకూడదు అంటే.. ఆ పండగ చేసుకోనివారు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అతివాదం మితిమీరుతోందని ఆన్ లైన్లో ఉద్యమం మొదలైంది. ఇకపై ఇలా హిందువుల పండగలన్నిటికీ నిషేధాలు విధిస్తూ పోతే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని అంటున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News