ఓలా, ఉబర్‌ కి లోకల్ సెగ.. కర్నాటకలో ఆటోలపై నిషేధం..

ఓలా, ఉబర్‌, ర్యాపిడో సంస్థలకు ఇచ్చిన లైసెన్స్‌.. కేవలం మోటర్‌ క్యాబ్‌ నడపడానికేనని, ఆటోలకు లేదని కర్నాటక రవాణాశాఖ తేల్చి చెప్పింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
Update:2022-10-08 12:07 IST

ఓలా, ఉబర్, ర్యాపిడో.. ఈ సంస్థలన్నీ స్థానికంగా ట్యాక్సీల నిర్వహణకు అనుమతులు తీసుకుని, ఆ తర్వాత ఆటో సర్వీసుల్లో కూడా అడుగు పెట్టాయనేది ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా ఆయా సంస్థలు ఆటోలు నడుపుతున్నాయంటూ కర్నాటక ప్రభుత్వం మండిపడింది. మూడు రోజుల్లో ఆటో సర్వీసులు ఆపేయాలంటూ హుకుం జారీ చేసింది. మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది.

ఓలా, ఉబర్ సర్వీసులపై ఫిర్యాదు..

ఆయా సంస్థలు 2 కిలోమీటర్ల దూరానికి కూడా ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం, మొదటి రెండు కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత కిలోమీటర్‌కు రూ.15 చొప్పున వసూలు చేయాలి. కానీ కర్నాటకలో ఓలా, ఉబర్ రేట్లు పెంచేశాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. ఓలా, ఉబర్‌, ర్యాపిడో సంస్థలకు ఇచ్చిన లైసెన్స్‌.. కేవలం మోటర్‌ క్యాబ్‌ నడపడానికేనని, ఆటోలకు లేదని ఆ రాష్ట్ర రవాణాశాఖ తేల్చి చెప్పింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లోకల్ సెగ..

ఎక్కడినుంచో వచ్చి ఓలా, ఉబర్ మన కడుపుకొడుతున్నాయంటూ స్థానిక కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవలే కేరళలో ఇలాంటి లోకల్ సర్వీస్ లను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. 'కేరళ సవారీ' పేరుతో ప్రభుత్వ ఆధీనంలో ఉండే క్యాబ్, ఆటో సర్వీసులను ప్రారంభించారు. ఆటో, క్యాబ్ ల ఓనర్లు 'కేరళ సవారీ'లో సభ్యులుగా చేరి ఉపాధి పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పుడు కర్నాటకలో కూడా ఇలాగే లోకల్ ట్యాక్సీలు ఒక యాప్ ద్వారా ఏకం అవుతున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలకు పోటీగా బెంగళూరు స్థానిక ఆటో డ్రైవర్లు సొంతంగా 'నమ్మ యాత్రి' పేరుతో కొత్త యాప్‌ అందుబాటులోకి తెస్తున్నారు. నవంబర్ 1నుంచి దీన్ని ప్రారంభిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News