రేపిస్ట్ లకు బెయిలు.. హక్కుల కార్యకర్తలు జైలులో కుదేలు..

ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్ట్ రోహిత్ కుమార్ రాసిన ఓ లేఖకు ఉమర్ ఖలీద్ సమాధానమిస్తూ రాసిన తిరుగు టపా కన్నీరు తెప్పించేలా ఉంది. జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ తన గోడు వెళ్లబోసుకున్నారు ఉమర్ ఖలీద్.

Advertisement
Update:2022-09-13 16:22 IST

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల రేపిస్ట్ లకు బెయిలిచ్చి గుజరాత్ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. అదే సమయంలో హక్కుల కార్యకర్తలు మాత్రం జైలులో మగ్గిపోతున్నారు. 35 ఏళ్ల వయసులో బెయిలు లేకుండా జైలు జీవితం అనుభవిస్తున్న అలాంటి హక్కుల కార్యకర్తల్లో ఒకరు ఉమర్ ఖలీద్. ఢిల్లీ అల్లర్ల కారణంగా అతడిని ఉపా చట్టం కింద తీహార్ జైలుకి పంపించారు. బెయిలు లేకుండా విచారణ కొనసాగుతూనే ఉంది. నెలలు సంవత్సరాలయ్యాయి, రెండేళ్లుగా ఉమర్ ఖలీద్ తీహార్ జైలులో మగ్గిపోతున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్ట్ రోహిత్ కుమార్ రాసిన ఓ లేఖకు ఉమర్ ఖలీద్ సమాధానమిస్తూ రాసిన తిరుగు టపా కన్నీరు తెప్పించేలా ఉంది. జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ తన గోడు వెళ్లబోసుకున్నారు ఉమర్ ఖలీద్.

ఆగస్ట్ 15 సందర్భంగా విడుదలవుతున్న ఖైదీల పేర్లు చదువుతున్నప్పుడు తాను కూడా ఆసక్తిగా విన్నానని, తన పేరు అందులో ఉండదని తనకు తెలుసని చెబుతున్నారు ఉమర్ ఖలీద్. ఈ జైలు జీవితం ఇప్పుడే మొదలైందా, సగంలో ఉందా, లేదా చరమాంకానికి చేరుకున్నానా అని తాను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటానని చెబుతున్నారాయన. విడుదలవుతున్న ఖైదీల ఆనందాన్ని తాను అర్థం చేసుకోగలుగుతున్నానని, కానీ ఉపా లాంటి చట్టాలతో తనలాంటి హక్కుల కార్యకర్తలను జైలులో పడేసే దుర్మార్గ రాజకీయ క్రీడకు తాను బలైపోయానని అంటున్నారు. ఉపా చట్టానికి బ్రిటిష్ వారి రౌలత్ చట్టానికి ఏమాత్రం తేడా లేదని అంటున్నారాయన. జైలు వార్డెన్ కి కూడా తనకి బెయిల్ ఎందుకు రావడంలేదో అర్థం కాలేదని, ఇలాంటి చట్టాల గురించి వివరించబోతే, అతనికి ఆసక్తి లేదని తనకి అర్థమైనట్టు వివరించారు ఉమర్ ఖలీద్.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్ గా హక్కుల కార్యకర్తగా ఉమర్ ఖలీద్ అందరికీ సుపరిచితుడే. ఎంతోమంది జర్నలిస్ట్ లు ఆయనకు స్నేహితులు. కానీ తాను అరెస్ట్ అయిన సందర్భంలో తనపై పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలు వెలువడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమర్ ఖలీద్. బాహ్య ప్రపంచం గురించి తెలుసుకోడానికి జైలులో పత్రికలే తమకి ఆధారం అని, అయితే ఆ పత్రికలకు తమ వార్తలు ఇష్టం లేదని చెప్పారు. కేవలం సంచలనాత్మక వార్తలకే పత్రికలు ప్రాధాన్యమిస్తున్నాయని అన్నారు.

మాటలతో పనికాదు, రక్తంతోనే పని జరుగుతుందని తాను ఎక్కడో అన్నట్టు ఒక పత్రిక హెడ్ లైన్ పెట్టిందని, మరో పత్రికలో తాను ముస్లిం దేశం కోసం పోరాడుతున్నట్టు చూపించారని.. ఇవన్నీ కట్టుకథలని చెప్పారు ఖలీద్. ఢిల్లీ అల్లర్లలో ఎక్కువమంది ముస్లింలు చనిపోయారని, ముస్లిం దేశం కోరుకునే తాను అలా ఎందుకు చేస్తానని, ఆ అల్లర్లకు తనని బలి పశువుని చేశారని అంటున్నారు ఖలీద్. తాను తప్పు ఒప్పుకున్నట్టు కూడా కొన్ని పత్రికలు రాసుకొచ్చాయని, వాస్తవానికి తాను ఎక్కడా వాంగ్మూలం ఇవ్వలేదని, ఏ కాగితంపై కూడా సంతకం చేయలేదని చెప్పారు. అల్లర్లకు ముందు తాను షార్జీల్ ఇమామ్ ని రహస్యంగా కలిసినట్టు మరో పత్రిక కథనాలిచ్చిందని, తాను ఆరోజు ఢిల్లీకి 1136 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఉన్నానని వివరించారు. తాను కలిశానని చెబుతున్న షార్జీల్ ఇమామ్ తీహార్ జైలులో ఉన్నారని.. అసలు ఇలాంటి వార్తా కథనాలు ఎలా పుట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి కథనాలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని, పేపర్లో వచ్చింది కదా, ఎంతో కొంత నిజం ఉంటుందని వారు ఆలోచిస్తారని చెబుతున్నారు ఖలీద్. రోజు ఇలా అబద్ధాలే చదువుతూ ఉంటే, ప్రజలు అసత్యానికి సత్యానికి మధ్య తేడా గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారని చెప్పారు.

విచారణ సందర్భంగా అప్పుడప్పుడు జైలునుంచి కోర్టుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు బయట ట్రాఫిక్ రణగొణ ధ్వనులు తనకు చికాకు తెప్పిస్తాయని, తాను జైలు జీవితానికి, ఆ నిశ్శబ్దానికి పూర్తిగా అలవాటుపడిపోయాయని అంటున్నారాయన. గతంలో ఒంటరిగా ఉన్నప్పుడు తల గోడకు కొట్టుకునేవాడినని, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటానికి అలవాటు పడ్డానని చెప్పారు.

ఉమర్ ఖలీద్ రాసిన ఈ లేఖ ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తుంది. జైలు జీవితం గడుపుతూ కనీసం బెయిలు కూడా రాని దుస్థితిలో ఉన్నారు హక్కుల కార్యకర్తలు. మరోవైపు రాజకీయ పలుకుబడి ఉన్నవారు క్రూరమైన తప్పులు చేసి కూడా బెయిలుపై దర్జాగా బయట తిరుగుతున్నారు. రేపిస్ట్ లకు సైతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష పెట్టే దేశం మనది అని బిల్కిస్ బానో ఉదంతం మరోసారి రుజువు చేసింది.

Tags:    
Advertisement

Similar News