'రాందేవ్ బాబా వల్ల ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరుకు భంగం కలుగుతోంది'

రాందేవ్ బాబా మాటలవల్ల ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరుకు భంగం కలుగుతోంది అని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అనుప్ జైరాం భంబానీ వ్యాఖ్యానించారు. అలోపతి వైద్యంపై రాందేవ్ చేసిన‌ దూషణలకు వ్యతిరేకంగా అలోపతి వైద్యుల సంఘం ఆయన మీద కేసు దాఖలు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2022-08-19 16:16 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నప్పటికీ ఆయనకు మళ్లీ ఆ వ్యాధి సోకింది కనక అలోపతి వైద్యం దండగ అని రాందేవ్ బాబా ఇటీవల వ్యాఖ్యానించడాన్ని దిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. తాను తయారు చేసిన కోరోనిల్ ఔషధం అమ్మకాల కోసం రాందేవ్ బాబా పడరాని పాట్లు పడ్డారు. ఆ ఔషధం విడుదల చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రి హాజరు అయ్యారు. తన ఔషధం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. కానీ రాందేవ్ అలోపతి వైద్యాన్ని కించపరుస్తూ ఉంటారు.

"రాందేవ్ బాబా మాటలవల్ల ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరుకు భంగం కలుగుతోంది. అది నాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయుర్వేదం ప్రాచీన వైద్య విధానం. ఆయుర్వేదం పేరు చెడగొట్టకుండా ఉందాం" అని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అనుప్ జైరాం భంబానీ వ్యాఖ్యానించారు.

రాందేవ్ తన ఔషధాన్ని ప్రచారం చేసుకోవడానికి తోడు జో బైడెన్ అలోపతి వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయిందని అనడం రెండు దేశాలమధ్య ఉన్న సంబంధాలకు విఘాతం కల్గించేట్టుగా ఉందని భంబానీ అన్నారు. ఇతర దేశాల నాయకుల పేరెత్తినందువల్ల సంబంధాలు బెడిసిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.

"నేను కరోనా టీకా తీసుకోను అనడం వేరు. కానీ టీకా పనికి మాలింది, తీసుకోకండి. నేను తయారు చేసిన ఔషధమే ప్రపంచ నాయకులూ వాడాలి" అనడం అన్యాయం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

రాందేవ్ కు పలుకుబడి ఉండొచ్చు. లక్షలాదిగా శిష్యగణం ఉండొచ్చు. కానీ ప్రజలను పెడదారి పట్టించకూడదు అని భంబానీ అన్నారు.

రాందేవ్ కోరోనిల్ తయారు చేసినప్పుడు ప్రచారం చేసుకోవడంతో ఆగకుండా అలోపతి పనికి మాలిందని వ్యాఖ్యానించారు. ఈ దూషణలకు వ్యతిరేకంగా అలోపతి వైద్యుల సంఘం ఆయన మీద కేసు దాఖలు చేసింది. కనీసం ఈ కేసు విచారణ పూర్తి అయ్యేదాకా అయినా కోరోనిల్ గురించి ప్రచారం మానుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు ఈ సర్కారీ బాబా తరఫు న్యాయవాది సమాధానమే ఇవ్వలేదు.

తన మీద వ్యాజ్యం వేసిన వారిని రాందేవ్ అవమానించడాన్ని కూడా న్యాయమూర్తి తప్పుబట్టారు. ఈ కేసు కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య కేసుగా పరిణమించింది అన్న రాందేవ్ తరఫు న్యాయవాది దానికి రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నించారు. అప్పుడు "కోర్టు గదిలో రాజకీయాలకు తావు లేదు" అని న్యాయమూర్తి గట్టిగా చెప్పవలసి వచ్చింది. ఈ కేసు విచారణ వచ్చే వారం కొనసాగుతుంది.

కరోనాకు అలోపతి వైద్యం చేయించుకున్నందువల్లే వేలాది మంది మరణించారు అని రాందేవ్ బాబా వ్యాధి విస్తృతంగా ఉన్నప్పుడే వ్యాఖ్యానించడాన్ని అలోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాందేవ్ ప్రచారంవల్ల ప్రజలు అలోపతి వైద్యం మీద నమ్మకం వదులుకునే పరిస్థితి దాపురిస్తుందని, ఇది వారి ఆరోగ్య హక్కును హరించినట్టవుతుందని డాక్టర్ల సంఘం వాదిస్తోంది.

Tags:    
Advertisement

Similar News