కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించనున్న ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు
కేంద్ర అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28న మహారాష్ట్ర విధాన సభ ముట్టడికి బీఎమ్ ఎస్ పిలుపునిచ్చింది. మరో వైపు డిసెంబరు 19న ఢిల్లీలో జాతీయ స్థాయి 'కిసాన్ గర్జన' నిరసన ప్రదర్శనను చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) ప్రకటించింది.
కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు పోరుకు సిద్దమయ్యాయి. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ లు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.
కేంద్ర అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28న మహారాష్ట్ర విధాన సభ ముట్టడికి బీఎమ్ ఎస్ పిలుపునిచ్చింది. నాగ్ పూర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా బీఎమ్ ఎస్ ఈ కార్యక్రమం చేపట్టింది.
ఈ మేరకు ఈ నెల 12 న బీఎమ్ ఎస్ సంకల్ప యాత్ర ప్రారంభించింది. " డిసెంబర్ 12న BMS వ్యవస్థాపకుడు దత్తోపంత్ తెంగడి జన్మస్థలమైన వార్ధాలోని అర్వీ నుండి సంకల్ప్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 11 విదర్భ జిల్లాల గుండా వెళుతుంది, ఈ యాత్ర డిసెంబర్ 28న మహా మోర్చాతో ముగుస్తుంది" అని బీఎమ్ ఎస్ విదర్భ ప్రదేశ్ అధ్యక్షురాలు శిల్పా దేశ్‌పాండే తెలిపారు.
మరో వైపు రైతులు కూడా కేంద్రం పై పోరుకు రెడీ అంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) డిసెంబరు 19న ఢిల్లీలో జాతీయ స్థాయి 'కిసాన్ గర్జన' నిరసన ప్రదర్శనను చేపట్టనున్నట్లు గురువారం తెలిపింది.
ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు మొదలైన వాటిని అందించే రైతులు నేడు తమ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీకేఎస్ కార్యవర్గ సభ్యుడు నానా ఆఖ్రే ఒక ప్రకటనలో తెలిపారు.
"రైతుల కష్టాలను తీర్చడానికి, అన్ని వ్యవసాయ ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించకూడదని, కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే ఆర్థిక ఉపశమనాన్ని మరింత పెంచాలని BKS డిమాండ్ చేస్తున్నది.'' అని ఆఖ్రే తన ప్రకటనలో పేర్కొన్నారు.
దేశ రాజధానిలో సోమవారం జరిగే 'కిసాన్ గర్జన' ర్యాలీలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు పాల్గొంటారని ఆఖ్రే చెప్పారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తున్నది. దీంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డ BMS, BKS సంఘాలకు క్రమ క్రమంగా ఆయా వర్గాలు దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు సంఘాలు ఉద్యమ కార్యక్రమానికి పిలుపునివ్వడం గమనార్హం.
కాగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంవత్సరం పాటు ఉద్యమించిన రైతు సంఘాలతో ముందు కలవకపోయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో ఆలస్యంగానైనా బీకేఎస్ కు వారితో చేతులు కలపాల్సి వచ్చింది. అయితే ఉద్యమ సమయంలో ప్రతి మలుపులో ఆ సంఘం ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి.