మద్యానికి బానిసైన 300 మంది పోలీసులు ఇంటికి.. అస్సోం సీఎం సంచలన నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా 300 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు మద్యానికి బానిస అయినట్లు గుర్తించాం. మద్యం అతిగా తాగడం వల్ల వీరు ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయారు.
అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట బాల్య వివాహాలు చేసుకున్న వేలాదిమంది పురుషులను అరెస్టు చేయించారు. అలాగే రాష్ట్రంలో మదార్సాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు మద్యానికి బానిసై ఫిట్నెస్ కోల్పోయిన 300 మంది పోలీసులతో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేయించి ఇంటికి సాగనంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హిమంత బిశ్వ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మద్యానికి బానిసైన పోలీసులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పాత నిబంధనే అయినప్పటికీ.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. వీఆర్ఎస్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని.. ఖాళీల భర్తీకి నియామకాలు కూడా వెంటనే చేపడతామని ఆయన ప్రకటించారు.
'రాష్ట్రవ్యాప్తంగా 300 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు మద్యానికి బానిస అయినట్లు గుర్తించాం. మద్యం అతిగా తాగడం వల్ల వీరు ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయారు. వీరికి వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు, స్థూలకాయులు, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అధికారులకు వీఆర్ఎస్ లేదా సీఆర్ఎస్ పరిహారం ఇస్తాం. ప్రస్తుతం 250 మంది పోలీసు సిబ్బందికి ఒకేసారి పరిహారం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది' అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇక పోలీసు అధికారులు శారీరక దారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని, పోలీస్ స్టేషన్లను సందర్శించి నమోదవుతున్న కేసులను ముగింపునకు చర్యలు తీసుకువస్తున్నారో లేదో పరిశీలించాలని డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ప్రతి పనికి జిల్లా కేంద్రానికి పరుగులు తీయకుండా పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.