గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ ప్రెసిడెంట్ కాలేరు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం పదవి నుంచి కూడా తప్పుకుంటానని గెహ్లాట్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అని రాహుల్ అన్న వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయాన్ని మాత్రం తాను చెప్పలేనన్నారు.

Advertisement
Update:2022-09-23 17:05 IST

కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కాలేరని, ఈ మేరకు ఆ ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని కలిసిన అనంతరం గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జాతీయ అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అశోక్ గెహ్లాట్.. తనతో రాహుల్ గాంధీనే స్వయంగా అన్న మాటలను మీడియాకు వెల్లడించారు. తదుపరి అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సిందిగా తాను రాహుల్ గాంధీని చాలాసార్లు కోరాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కాకూడదని తాము కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పారన్నారు. త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తానని కూడా అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకతను రాహుల్ తనకు వివరించారని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత నాన్-గాంధీ ఫ్యామిలీ వ్యక్తి అధ్యక్షుడు కావడం గ్యారెంటీ అని గెహ్లాట్ స్పష్టం చేశారు.

రాజస్థాన్ సీఎం పదవి నుంచి కూడా తప్పుకుంటానని గెహ్లాట్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అని రాహుల్ అన్న వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయాన్ని మాత్రం తాను చెప్పలేనన్నారు. సీఎం అభ్యర్థిని రాజస్థాన్ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్, సోనియా గాంధీ కలసి నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.

కాగా, రాజస్థాన్ అసెంబ్లీలో అశోక్ గెహ్లాట్‌కు పూర్తి మెజార్టీ ఉన్నది. సీఎల్పీలో కూడా గెహ్లాట్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. గెహ్లాట్ ప్రత్యర్థి సచిన్ పైలట్ సీఎం పోస్టును ఆశిస్తున్నారు. అయితే తన మనిషి సీఎం పోస్టులో ఉండాలని గెహ్లాట్ కోరుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, ఇద్దరు మంత్రులు గెహ్లాట్ లిస్టులో ఉన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌కు సమాంతరంగా సీఎం ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్ష ఎన్నిక ముగిసి, ఫలితం వచ్చిన తర్వాతే రాజస్థాన్ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్‌తో పాటు ఎంపీ శశిథరూర్, మాజీ మంత్రి మనీశ్ తివారి, మధ్యప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్‌లు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు. అయితే గాంధీ కుటుంబం మాత్రం అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతున్నది.

Tags:    
Advertisement

Similar News