సింగపూర్ వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వండి... మోదీకి కేజ్రీవాల్ లేఖ‌!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలన్నా కేంద్రం అనుమతి ఉండాలన్న మాట ! మోడీ ప్రభుత్వం మోకాలడ్డిందంటే ఆ సీఎం ఫారిన్ ప్రయాణం అటకెక్కినట్టేనా ? పర్మిషన్ రాకపోతే అంతే సంగతులేనా ? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పుడు అలాంటి గడ్డు సమస్యే వచ్చింది.

Advertisement
Update:2022-07-17 18:52 IST

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలన్నా కేంద్రం అనుమతి ఉండాలన్న మాట ! మోడీ ప్రభుత్వం మోకాలడ్డిందంటే ఆ సీఎం ఫారిన్ ప్రయాణం అటకెక్కినట్టేనా ? పర్మిషన్ రాకపోతే అంతే సంగతులేనా ? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పుడు అలాంటి గడ్డు సమస్యే వచ్చింది. తాను సింగపూర్ వెళ్లాల్సి ఉందని , అనుమతించాలని ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇది మామూలుగా లేదు. తీవ్ర పదజాలంతో ఉంది. మీ అనుమతి కోసం దాదాపు నెలరోజులుగా ఎదురుచూస్తున్నానని, పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పర్మిషన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఆ దేశంలో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో తను పాల్గొనాల్సి ఉందని, తన ఈ ట్రిప్ దేశానికి గర్వకారణమవుతుందని ఆయన పేర్కొన్నారు. 'ఆగస్టు మొదటివారంలో జరిగే ఈ సమ్మిట్ కి హాజరు కావలసిందిగా సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ నన్ను గత జూన్ లోనే ఆహ్వానించారు. పైగా ఈ కార్యక్రమానికి మొదటిరోజే అటెండ్ అవ్వాలని మరీ మరీ కోరారు. కానీ ఆ దేశానికి వెళ్లేందుకు నాకిప్పటికీ పర్మిషన్ లభించలేదు' అని కేజ్రీవాల్ వాపోయారు

జూన్ 7 న తాను లేఖ రాశానని, కానీ దానికి ఇప్పటివరకు సమాధానం రాలేదన్నారు. ఓ ముఖ్యమైన ఈవెంట్ కి హాజరు కావడానికి విదేశానికి వెళ్లగోరే ఏ ముఖ్యమంత్రినీ ఆపడం సరైనది కాదని ఆయన అన్నారు. నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలనియా ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు ఢిల్లీ లోని ఓ స్కూలును విజిట్ చేసి ఇక్కడి విద్యావిధానాన్ని ఎంతో ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు అంతకు ముందు ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బన్ కీ మూన్ , నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లెమ్ కూడా ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను సందర్శించి ఎంతో పొగిడారని ఆయన వెల్లడించారు. ఢిల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ మోడల్ పట్ల ప్రపంచం చాలా ఇంప్రెస్ అయిందన్నారు. సింగపూర్ లో జరిగే సమ్మిట్ లో ఢిల్లీ గవర్నెన్స్ మోడల్ ని ప్రపంచ నేతలు తెలుసుకోగోరుతారని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా తనను అనుమతించాలని ఆయన అభ్యర్థించారు.

తన సింగపూర్ టూర్ కి సంబంధించి జూన్ లోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకి కూడా లేఖ పంపినప్పటికీ ఇంకా క్లియర్ కాలేదని కేజ్రీవాల్ తెలిపారు. నేను ఆ దేశానికి వెళ్లి ఈ సమ్మిట్ లో పాల్గొంటే ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టం తో బాటు, మొహల్లా క్లినిక్ ల గురించి,ఉచిత విద్యుత్ పథకం గురించి ప్రపంచ నేతలకు వివరిస్తా.. ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది కూడా.. మన దేశ ప్రతిష్టకు, గౌరవానికి ఇంతకంటే ఏం కావాలి అని అరవింద్ కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.

నాకు, మీకు మధ్య రాజకీయ విభేదాలుండవచ్ఛు .. కానీ వీటిని పక్కన బెట్టి మన దేశ ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేద్దాం అని మోడీని ఉద్దేశించి ఆయన అన్నారు. మీరు గుజరాత్ సీఎంగా ఉండగా అమెరికా మీకు వీసా తిరస్కరించిందని, అప్పుడు దేశమంతా మీకు మద్దతునిచ్చి అమెరికా వైఖరిని ఖండించిందని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు ఓ ముఖ్యమంత్రికి మోకాలడ్డుతున్నారంటే ఇది దేశ ప్రయోజనాలకే భంగకరం అని వ్యాఖ్యానించారు.




Tags:    
Advertisement

Similar News