కేజ్రీవాల్‌కు రూ.164 కోట్ల రికవరీ నోటీసు.. - రాజకీయ ప్రకటనలను ప్రభుత్వ ప్రకటనలుగా ప్రకటించారని ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత రికవరీ చేయడంలో విఫలమైతే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల ప్రకారం.. పార్టీ ఆస్తులు అటాచ్‌మెంట్ సహా అన్ని చట్టపరమైన చర్యలూ తీసుకోనున్నట్టు డీఐపీ పేర్కొంది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి మరో కొత్త సమస్య ఎదురైంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ప్రభుత్వ సమాచార, ప్రచార డైరెక్టరేట్ (డీఐపీ) నోటీసు జారీ చేసింది. రాజకీయ ప్రకటనలను ప్రభుత్వ ప్రకటనలుగా ప్రచురించిందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వ సమాచార, ప్రచార డైరెక్టరేట్ (డీఐపీ) ఈ నోటీసు ఇచ్చింది. ఇందుకు గాను సుమారు రూ.164 కోట్ల సొమ్ము రికవరీ చేయాలని ఆ నోటీసులో పేర్కొంది.
జారీ అయిన నోటీసు ప్రకారం పది రోజుల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత రికవరీ చేయడంలో విఫలమైతే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల ప్రకారం.. పార్టీ ఆస్తులు అటాచ్‌మెంట్ సహా అన్ని చట్టపరమైన చర్యలూ తీసుకోనున్నట్టు డీఐపీ పేర్కొంది.
ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ప్రచురించిన రాజకీయ ప్రకటనల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రధాన కార్యదర్శిని నెల రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే డీఐపీ తాజా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుపై పార్టీ ఇంకా స్పందించలేదు.