జోడో యాత్ర ప్రభావంతో రాజస్తాన్ లో ఏకమవుతున్న ప్రత్యర్దులు..!
రాజస్థాన్ లో ఉప్పూ నిప్పులా ఉన్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ లు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను రాజస్థాన్లో విజయవంతం చేస్తామని ముక్తకంఠంతో పలికారు.
నిన్న మొన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న కాంగ్రెస్ నేతలిద్దరూ ఏకమవుతున్నారు. తమకు పార్టీయే సుప్రీమ్ అని వారిద్దరకూ ముక్త కంఠంతో చెబుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప మఖ్యమంత్రి సచిన్ పైలట్ ఇద్దరూ పక్కపక్కనే నిల్చుని మీడియాతో మాట్లాడడంతో కలవని ధృవాలు కలిశాయంటూ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా రాహుల్ గాంధీ చేపట్టిన 'జోడో యాత్ర' ప్రభావమేనని చెబుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్నది. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర భారీగా విజయవంతం అవుతుందని ఇద్దరు నేతలు చెప్పారు.
"పార్టీయే మాకు సుప్రీమ్. పార్టీ విజయవంతంగా ముందుకు సాగాలని, తిరిగి పూర్వ వైభవం పొందాలని మేము కోరుకుంటున్నాము" అని ముఖ్యమంత్రి గెహ్లాట్ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను "రాజస్థాన్‌లో ఉత్సాహంతో స్వాగతిస్తామని" సచిన్ పైలట్ అన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం ఈ యాత్రలో పాల్గొనకుండా సచిన్ పైలట్ ను దూరం పెట్టేలా గెహ్లాట్ వ్యాఖ్యలు చేశారు. సచిన్ ను ద్రోహి అంటూ అభివర్ణించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐక్యంగా ఉండాల్సిన సమయంలో గెహ్లాట్ వంటి సీనియర్ నేత నోటినుంచి అటువంటి మాటలు రాకుండా ఉండాల్సిందని సచిన్ కూడా అన్నారు. అనుభవజ్ఞుడైన గెహ్లాట్, యువకుడు,శక్తిమంతుడైన పైలట్ - "పార్టీకి ఇద్దరు నాయకులు అవసరం.వారు పార్టీకి ఆస్తి వంటివారు" అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వివాదాన్ని పరిష్కరిస్తామని సీనియర్ నేత వేణుగోపాల్ చెప్పారు. రాహుల్ గాంధీ కూడా గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్టీకి ఆ ఇద్దరూ నాయకులు అవసరం, పార్టీ ఆస్తులు అని ఇండోర్ లో యాత్ర సందర్భంగా అన్నారు. తమను ఆస్తులని రాహుల్ గాంధీయే అన్నప్పుడు ఇక వివాదం ఏముంది అని గెహ్లాట్ మీడియా తో అన్నారు.