జమ్ముకశ్మీర్‌లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌

కొత్తగా ఏర్పాటైన టెర్రిరిస్ట్‌ గ్రూప్‌ తెహ్రీక్‌ లబైక్‌ యూ ముస్లిం (టీఎల్‌ఎం)ను విచ్ఛిన్నం చేయడమే దీని లక్ష్యం

Advertisement
Update:2024-10-22 12:05 IST

జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. వరుస సోదాలు నిర్వహించి కొత్తగా ఏర్పాటైన టెర్రిరిస్ట్‌ గ్రూప్‌ తెహ్రీక్‌ లబైక్‌ యూ ముస్లిం (టీఎల్‌ఎం)ను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని, బాబా హమాస్‌ అనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి దాని కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గాందర్‌బల్‌ ప్రాంతం సోన్‌మార్గ్‌ వద్ద సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద ఉగ్రవాదులు చేసిన దాడిలో స్థానికేతర కూలీలు, వైద్యుడితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆదివారం జరిగిన ఈ ఘటనను భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ ఉగ్రమూకల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

శ్రీనగర్, గాందర్‌బల్‌, బాందిపొరా, కుల్గామ్‌, బుడ్గాం, అనంత్‌నాగ్‌, పుల్వామా జిల్లాల్లోఈ సోదాలు జరిగాయి. తీవ్రవాద కార్యకలాపాల కోసం ఇటీవల టీఎల్‌ఎం భారీగా యువతను రిక్రూట్‌ చేసుకుంటున్నదని, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాబా హమాస్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్‌ చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. గాందర్‌బల్‌ ప్రాంతం లో దాడి చేసిన వారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని, వారు ఆ ప్రాంతాన్ని ముందుగానే క్షుణ్నంగా పరిశీలించారని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. లేదా స్థానికులు ఎవరైనా వారికి సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే కశ్మీర్‌ గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నా ఈప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం ఇదే మొదటిసారి

Tags:    
Advertisement

Similar News